ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ, టీఎంయూలకు జైకొట్టిన శ్రామికులు
క్లాస్–3లో ఎంప్లాయీస్ యూనియన్ క్లాస్–6లో టీఎంయూ ఆధిక్యం
కరీంనగర్‌టౌన్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో శ్రమికులు ఎర్రజెండా కూటమికే పట్టం కట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆర్టీసీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకోగా కార్మికులు కమ్యూనిస్టుల వైపే మొగ్గు చూపారు. సర్కారులో విలీనం చేస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా ఆక్యూపెన్సీ రేషియో పెంచామని, సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా డిపోల గేట్ మీటింగ్‌లు, సమావేశాల్లో హామీల వర్షం కురిపించినా కార్మికులు కనికరించకపోవడం, ఫలితాలు భిన్నంగా రావడంతో కాంగ్రెస్‌తో పాటు టీడబ్ల్యూయూ కూటమి నేతలు కంగుతిన్నారు.
ఫలితాలు తారుమారు
జిల్లాలో ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం తారుమారు కావడం, రీజియన్, రాష్ట్రస్థాయిలో అధికార పార్టీ మద్దతుదారులు ఓటమి చెందడంపై లెక్కలేసుకుంటున్నారు. అధికారపార్టీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని ప్రలోభాలు, ప్రయత్నాలు చేసిన కార్మికులు తలవంచలేదనే చర్చ జోరుగా సాగుతోంది.
ఫలించని ప్రలోభాలు
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మద్దతునున్న టీడబ్ల్యూయూ కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈయూ కూటమికే కార్మికులు జై కొట్టారు. దీంతో టీడబ్ల్యూయూ కూటమి ఘోర పరాజయన్ని మూటకట్టుకుంది. మెత్తంగా ఆర్టీసీ గుర్తింపు ఫలి తాలతో కాంగ్రెస్‌పార్టీతో పాటు జతకట్టిన కూటమి యూనియన్ నాయకులు అంతర్మథనంలో పడ్డారు.
క్లాస్–3 లో ఈయూ.. క్లాస్–6లో టీఎంయూ
ఆర్టీసీ కార్మికుల తీర్పు ఈయూ– టీఎంయూ కూటమికి అనుకూలంగా వెలువడింది. దశాబ్దకాలం తర్వాత జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కరీంనగర్ రీజియన్ పరిధిలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సత్తాచాటాయి. రీజియన్ పరిధిలోని 2,754 ఓట్లలో క్లాస్–3 విభాగానికి సంబంధించి ఈయూకు 1,515 ఓట్లు, టీడబ్ల్యూయూకు 1,115 ఓట్లు లభించాయి. క్లాస్–3 విభాగంలో ఈయూ ప్రత్యర్థి సంఘం కన్నా 400 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. క్లాస్–6లో టీఎంయూ 327 ఓట్ల తేడాతో ముందంజలో నిలిచింది. 11 డిపోల్లో సాగిన పోటీలో కార్మికుల మద్దతు కూడగట్టడంలో ఈ సంఘాలు విజయవంతమయ్యాయి. క్లాస్–6 విభాగంలో టీఎంయూ 1,495 ఓట్లు రాగా తెలంగాణ వర్కర్స్ యూనియన్ 1,168 ఓట్లు వచ్చాయి. టీఎంయూకు 327 ఓట్ల ఆధిక్యం లభించింది. గుర్తింపు సంఘం హోదాకు అవసరమైన 51 శాతం ఓట్లను దాటినట్లు ఎన్నికల వివరాలు వెల్లడిస్తున్నాయి. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలకు పోటీగా టీఎంయూ, ఈయూ, ఎన్‌ఎంయూలు జేఏసీగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ క్రమంలో క్లాస్–3, క్లాస్–6 విభాగాల్లో నమోదైన ఫలితాలు కూటమి సంఘాలకు అనుకూలంగా నిలిచాయి.
రీజియన్‌లో డిపోల వారీగా పోలైన ఓట్ల వివరాలు
డిపో క్లాస్–3లో క్లాస్–6లో
టీఎంయూ టీడబ్ల్యూయూ టీఎంయూ టీడబ్ల్యూయూ
కరీంనగర్–1 214 125 222 115
కరీంనగర్–2 115 137 114 142
హుజూరాబాద్ 213 135 110 98
హుస్నాబాద్ 101 104 92 100
సిరిసిల్ల 167 31 172 38
వేములవాడ 183 29 166 43
జగిత్యాల 139 154 158 135
కోరుట్ల 96 68 101 70
మెట్‌పల్లి 81 84 71 95
గోదావరిఖని 195 200 183 210
మంథని 75 85 91 98
ఆర్‌ఎంఆఫీస్ 14 25 15 24 మొత్తం 1,515 1,115 1,495 1,168


