మేడిపల్లి: పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే గండెపోటుతో మృతి చెందిన భీమారం మండల కేంద్రానికి చెందిన ఇండ్ల గంగారాజం (48) మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరింది. పది నెలల క్రితం గంగారాజం అబుదాబి వెళ్లాడు. ఓ కంపెనీలో క్లీనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వారం క్రితం విధుల్లో ఉండగానే గుండెలో మంటగా ఉందని తోటి వర్కర్‌తో చెప్తూనే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతి విషయం కుటుంబసభ్యులు తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు. సర్పంచ్ చెక్కపల్లి స్వాతి, గ్రామస్తులు అబుదాబిలోని పరిచయస్తులతో మాట్లాడి గంగారాజం మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించారు. గంగారాజంకు భార్య జల, ఇద్దరు కూతుళ్లు పూజిత, సుస్మిత, కుమారుడు మహేందర్ ఉన్నారు.
చర్యలు తీసుకోవాలి
హుజూరాబాద్: అక్రమంగా తమ భూమిలోకి ప్రవేశించి తనపై దాడి చేసి బెదిరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బజ్జూరి తిరుమలకు మద్దతుగా మహిళలు ఆదివారం పట్టణ శివారులోని కేసీ క్యాంపు వద్ద వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సైదాపూర్ మండలం బొమ్మకల్‌కు చెందిన బజ్జూరి తిరుమల భూమిపై అదే గ్రామానికి చెందిన బండి రమేశ్, బండి సారయ్య, ఎలవైన కొమురయ్య, బండి వనమ్మ కోర్టు ఆదేశాలున్నా ఆమె పొలం వద్దకు కర్రలతో దాడి చేశారన్నారు. ఈ విషయమై ఈనెల 9న సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, చిన్న కేసు పెట్టి స్టేషన్ బెయిల్‌తో బయటకు పంపగా ఆమైపె దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. ఆదివారం హుజురాబాద్ ఏసీపీ మాధవికి తన గోడు వెల్లబోసుకుందామని తిరుమల మహిళలతో వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో వారు కేసీ క్యాంప్ వద్ద వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు ఆమెతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీఇచ్చారు.


