పత్తి రైతు చిత్తు.. | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు చిత్తు..

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

దెబ్బతీసిన గాలితో కూడిన వానలు పూతరాలి దిగుబడిపై తీవ్ర ప్రభావం తొమ్మిదిసార్లు రసాయన మందుల పిచికారీ అయినా కోలుకోని చేన్లు రెండు సార్లకే లూటీపోతున్న పంట పెట్టుబడి రాక పరేషాన్‌ అవుతున్న రైతులు జిల్లాలో 48వేల ఎకరాల్లో సాగు

వీణవంక: ఊరంతా దసరా హడావుడి కనిపిస్తుండగా పత్తి రైతుల ఇంట్లో పండగ సందడి లేకుండా పోయింది. కొత్త పత్తి చేతికొచ్చి పండుగ ఘనంగా జరుపుకుందామనుకుంటే ఒక్కసారికే చేను ఎండిపోవడంతో పరేషాన్‌ అవుతున్నారు. పత్తి చేను మొదట్లో ఏపుగా పెరిగినా.. పూత దశలో వర్షాలు పడడంతోపాటు బలమైన గాలుల వీయడంతో దెబ్బతింది. వివిధ రకాల తెగుళ్లు సోకి, ఆరుసార్లు ఏరేపంట రెండుసార్లకే లూటీ పోతోంది. ఫలితంగా పెట్టబడి రాని పరిస్థితి నెలకొంది. కొంతమంది రైతులు గత్యంతరం లేక పత్తిని చెడగొట్టి మక్క సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈసారి 48వేల ఎకరాల్లో పత్తివేశారు. ఎకరాకు 13క్వింటాల చొప్పున జిల్లావ్యాప్తంగా సుమారు 7లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ అధికారులు, రైతుల అంచనాలు తారుమారయ్యాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. కనీసం ఎకరాకు 6 క్వింటాళ్ల పత్తి కూడా రావడం గగనంగా మారింది.

ముంచిన వాన

చేను పూత దశలో ఉన్న సమయంలో 4 రోజులపాటు వర్షాలు కురిసి తెగుళ్లు సోకాయి. రైతులు ఎకరాకు కనీసం తొమ్మిదిసార్లు రసాయన మందులను పిచికారీ చేశారు. ఈ లెక్కన రూ.20వేల పైగా మందులకే ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. మొదట్లో చేను ఏపుగా ఉండడంతో ఎకరాకు రూ.45వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. కనీసం 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడు 6 క్వింటాళ్లు కూడా వస్తుందో లేదోనని మదనపడుతున్నారు. మరోపక్క కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానాకాలం, యాసంగి పంటలకు కలుపుకొని ఎకరాకు రూ.25వేల చొప్పున భూ యజమానికి ముందస్తుగా కౌలు చెల్లించారు. ఖర్చులు పోను ఈ సీజన్‌లో మంచి దిగుబడి వస్తుందని అనుకుంటే వారి ఆశలు ఆవిరయ్యాయి. పెట్టుబడి మీద పడడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

క్వింటాల్‌కు రూ.8,620

ప్రస్తుతం మార్కెట్లో పత్తికి ఆశించిన స్థాయిలో ధర లేకపోయినా.. రైతులు ఏరిన పత్తి ఏరినట్టు విక్రయిస్తున్నారు. జమ్మికుంట మార్కెట్లో క్వింటల్‌ రూ.8,620 ధర పలికింది. కనీసం ధర రూ.10వేలు దాటితేనే ఏమైనా గిట్టుబాట వుతుందని వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన సమ్మయ్య అనే రైతు వాపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement