గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్ అర్బన్/సప్తగిరికాలనీ: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 7న శాతవాహన యూనివర్సిటీ స్నాత్సకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పోలీసు, వైద్య, విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటిస్తూ, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. బందోబస్తు సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. మెడికల్ టీం, 108,104, ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, డయాస్ ఇతర ఏర్పాట్లు ఆర్‌అండ్ బీ అధికారులు చూడాలని, తాగునీరు, శానిటేషన్, ఫాగింగ్ వంటి ఏర్పాట్లు చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందని, ఐడెంటిటీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని, గేటు వద్ద తనిఖీ కోసం యూనివర్సిటీ తరఫున సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే వారి పేర్ల జాబితాను ముందే సమర్పించాలన్నారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు గవర్నర్ కరీంనగర్ చేరుకుంటారన్నారు. పలువురు విద్యార్థులకు గోల్డ్ మెడల్, పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీసీపీ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.


