పోక్సో చట్టం అమలులో పాఠశాలల పాత్ర కీలకం
కరీంనగర్ టౌన్: పోక్సో చట్టం అమలులో పాఠశాలల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేఽశ మందిరంలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పోక్సో, ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి వెంకటేశ్ మాట్లాడుతూ.. పిల్లల రక్షణకు పాఠశాలలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చినప్పుడు పాటించాల్సిన విధివిధానాలు, బాధితులకు తక్షణ న్యాయ సాయం అందించే ప్రక్రియ, ఫిర్యాదుల గోప్యతను కాపాడటం వంటి అంశాలను వివరించారు. ప్రతి పాఠశాలలోనూ పిల్లలు ఫిర్యాదు చేయడానికి సరళమైన, భయం లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. న్యాయ సలహాలకు టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలన్నారు. డీఈవో శ్రీరాం మొండయ్య, లీగల్ ఎయిడ్ డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు ఏ.కిరణ్ కుమార్, డీసీఈబీ సెక్రటరీ భగవంతయ్య పాల్గొన్నారు.


