
వరి కోతకు వానగండం
ముస్తాబాద్(సిరిసిల్ల): అన్నదాతలను వానలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు చినుకు రాలక.. శ్రీదేవుడా వానమ్మను ఇవ్వుశ్రీ అంటూ మొర పెట్టుకున్న రైతులు.. ఇప్పుడు వద్దంటే వానలంటూ ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండిస్తున్న పంటలకు వాన గండంగా మారింది. రోజూ కురుస్తున్న వానలతో కోతకు వచ్చిన పంటను తీసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు ఎక్కువగా వరిపంట సాగుచేశారు. ఈనేపథ్యంలో కొన్ని చోట్ల పంట కోతకు రాగా, పక్షం రోజుల క్రితమే నీరు పెట్టడం మానేశారు. కాగా, నాలుగురోజుకో తుపాను రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంట చేతికచ్చే వరకు దినదిన గండంగానే వెళ్లదీస్తున్నారు.
దిగబడుతున్న హార్వెస్టర్లు
ఉమ్మడి జిల్లాలో వరి పంటే అధికంగా సాగుచేస్తున్నారు. కాగా నెల రోజులుగా కురుస్తున్న వానలతో పొలాల్లో నీరు నిలిచి ఉంది. ఇటీవల కురిసిన గాలివానకు పలుచోట్ల వందలాది ఎకరాల్లో వరి నేలవాలింది. దానిని హార్వెస్టు చేయడం గగనంగా మారింది. ఒకప్పుడు కూలీలతో పంటల కోతలు అయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పొలాల్లో నీరు నిలిచి ఉండడంతో కోతలకు వెళ్లిన హార్వెస్టర్లు దిగబడిపోతున్నాయి. గంటల తరబడి వాటిని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. పొలంలో హార్వెస్టరు దిగబడిన రైతులకే నష్టం. టైర్ల హార్వెస్టర్‌కు గంటకు రూ.2 వేలు అవుతున్నాయి. అదే చైన్ హార్వెస్టర్ సమయం ప్రకారం ఒక గంటకు రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందలాది హార్వెస్టర్లు పంట కోతలకు సిద్ధంగా ఉనన్న వానలతో వాటి ధరలు ఆకాశన్నంటాయి. గత సీజన్‌లో గంటకు రూ.2 వేలు చార్జ్ చేసిన నిర్వాహకులు ఇప్పుడు రూ.3వేలు వసూలు చేయడం రైతులకు భారంగా మారింది.
అన్నదాతను వెంటాడుతున్న వర్షాలు
పంటపొలాల్లో దిగబడుతున్న హార్వెస్టర్లు
వరికోతలకు పెరిగిన ధరలు