
పోలంపల్లి యువకుడి దారుణ హత్య?
తిమ్మాపూర్: మండలంలోని పోలంపల్లి గ్రామానికి చెందిన గడ్డం మహేందర్ ప్రస్తుతం తన తల్లితో నుస్తులాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటంతో భార్య తన పుట్టిల్లు అయిన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారి గ్రామంలో తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. దసరా పండుగ సందర్భంగా మహేందర్ తన పిల్లలను చూసుకోవడానికి తిప్పారి గ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాత అదే గ్రామంలో ఒకలోయలో అనుమానాస్పదంగా శవమై కనిపించాడు. స్థానికులు కుకునూరు పోలీస్‌లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ జరిపారు. అయితే, తన అత్తగారింటి వద్ద భార్య, బావమరుదులు కలిసి మహేందర్‌ను వేధించి, దారుణంగా కొట్టి, కాళ్లకు తువ్వాలతో కట్టి వాగులో పడేసినట్లు పోలీసుల విచారణలో మృతుడి కుటుంబసభ్యులు చెప్పినట్లు తేలింది. ఈ మేరకు మహేందర్ భార్యతోపాటు బావమరుదులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై, సీఐ తెలిపారు. అంత్యక్రియలకు కావలసిన డబ్బులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేశ్ చొరవతో పోలంపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
భార్య, బావమరుదుల వేధింపులే కారణమని కేసు