
ప్రకృతి బంతులు
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన జైలు అధికారులు
ఖైదీలతో 15 వేల సీడ్ బాల్స్ తయారీ
గుట్ట ప్రాంతాల్లో సీడ్ బంతులను విసిరిన అధికారులు
కరీంనగర్‌క్రైం: పర్యావరణ పరిరక్షణకు మేము సై తం అంటున్నారు కరీంనగర్ జైలు అధికారులు. వ ర్షాలకు ఖాళీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలనే ఆలోచనతో సీడ్ బాల్స్ తయారీ చేపట్టారు. కరీంనగర్ జైలు ఆధ్వర్యంలో ఖైదీలతో సీడ్ బాల్స్ తయారు చేసి వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. రకరకాల విత్తనాలతో విత్తన బంతుల తయారు చేసి విసరడం ద్వారా కొండలు, గుట్టల ప్రాంతాల్లో మరిన్ని చెట్లు పెంచాలని భావిస్తున్నారు.
నాణ్యమైన ఎర్ర మట్టితో..
సీడ్ బాల్స్ వల్ల పెరిగే మొక్కలను ప్రత్యేకంగా నాటి నీరు పోయాల్సిన అవసరం ఉండదు. వర్షాకాలంలో కొండలు, గుట్ట ప్రాంతాల్లో సీడ్‌బాల్స్ విసరడం వల్ల వాటంతట అవే పెరుగుతాయి. జైళ్ల డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా జైలులో వేప, చింత, కానుగ, అల్లనేరడి వంటి విత్తనాలతో 50 మంది ఖైదీలు 15 వేల సీడ్‌బాల్స్ తయారు చేశారు. ఇందుకోసం చొప్పదండి ప్రాంతం నుంచి నాణ్యమైన ఎర్రమట్టిని తెప్పించారు. విత్తనాలు సేకరించి ఆరబెట్టి, ఎర్రమట్టికి జీవామృతం, వర్మీ కంపోస్టును కలిపి సీడ్‌బాల్స్ తయారు చేసి భద్రపర్చారు. కరీంనగర్, హుజూరాబాద్ జైళ్ల పరిధిలో విత్తన బంతులను చల్లారు. గతంలో కరీంనగర్ జైలు తరఫున 3.5 లక్షల వరకు సీడ్ బాల్స్ తయారు చేశారు.