
బియ్యం.. నో స్టాక్
కరీంనగర్‌రూరల్: రేషన్ బియ్యం స్టాక్‌ను డీలర్లకు పంపిణీ చేయడంలో జాప్యమేర్పడుతోంది. గోదాం ఇన్‌చార్జికి రవాణా కాంట్రాక్టర్‌కు నడుమ నెలకొన్న విబేధాలతో కరీంనగర్‌రూరల్‌మండల రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నప్పటికీ సగం దుకాణాలకు మాత్రమే బియ్యం సరఫరా చేశారు. మిగితా దుకాణాలకు బియ్యం కేటాయించకపోవడంతో లబ్ధిదారులు దుకాణాలు చుట్టూ తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా 3,13,138 రేషన్‌కార్డులు, 9,33,267 మంది లబ్ధిదారులున్నారు. ప్రతినెల 566 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతోంది. కరీంనగర్ మండల స్టాక్ పాయింట్ నుంచి అక్టోబరు నెలకు 5,011 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు రవాణా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 2,768 టన్నులను మాత్రమే పంపించారు. కరీంనగర్ మండలంలో నగునూరు, ఎలబోతారం, వల్లంపహాడ్, ఆరెపల్లి, ఇరుకుల్ల, మందులపల్లి, చేగుర్తి, చెర్లభూత్కూర్, బొమ్మకల్ తదితర గ్రామాలకు బియ్యం రాకపోవడంతో డీలర్లు దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదాం అధికారులు తమకు అనుకూలంగా ఉన్న డీలర్లకు మాత్రమే బియ్యం స్టాక్ కేటాయిస్తున్నారు. మండల డీలర్లకు స్టాక్ లేదంటూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారని పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. ఉదయం 9గంటలకు గోదాంకు వెళ్లి మధ్యాహ్నం 2గంటల వరకు ఎదురు చూసినప్పటికీ స్టాక్ లేదంటూ తిప్పి పంపుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు.