ఫుట్‌పాత్‌లు ఆక్రమించి వ్యాపారాలు
తొలగించిన కొద్ది రోజులకే మళ్లీ అదే తీరు
తప్పని ట్రాఫిక్ కష్టాలు
కరీంనగర్ కార్పొరేషన్: ఫుట్‌పాత్‌లు, రోడ్లపై దందా మళ్లీ మొదలైంది. నగరపాలకసంస్థ అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ,రోడ్లపై వ్యాపారాలు పూర్వస్థితికి వచ్చాయి. ఫుట్‌పాత్‌లు, రోడ్లపై వ్యాపారాలు చేయవద్దంటూ నగరపాలకసంస్థ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కట్టడి చేసిన కొద్దిరోజులకే గతంలో మాదిరిగానే ఫుట్‌పాత్‌లే కాదు, ఏకంగా రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేపడుతున్నారు.
దుకాణాలకే ఫుట్‌పాత్‌లు
స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులు, టవర్‌సర్కిల్ లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం తెలిసిందే. స్మార్ట్ సిటీ నిబంధనల్లో భాగంగా రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. కానీ ఫుట్‌పాత్‌లు కేవలం ఆయా దుకాణదారుల కోసమే అన్నట్లుగా మారాయి. దుకాణదారులు తమ ముందున్న ఫుట్‌పాత్‌లపై వ్యాపార సామగ్రిని పెట్టుకోవడం సర్వసాధారణంగా మారింది. కొంతమంది వ్యాపారులైతే ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, శాశ్వత నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. రద్దీ, వాణిజ్య ప్రాంతాల్లో పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు. టవర్‌సర్కిల్‌తో పాటు, నగరంలోని ప్రధాన రహదారుల వెంట చాలాచోట్ల అసలు ఫుట్‌పాత్‌లే కనిపించవంటే అతిశయోక్తి కాదు.
ట్రాఫిక్‌కు ఇక్కట్లు..
ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణలతో నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు తీవ్రతరమవుతున్నాయి. నగరం విస్తరించడం, జనాభా పెరగడం, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగడంతో రద్దీ ఎక్కువైంది. రద్దీకి అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. వీటికి తోడు ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించి వ్యాపారాలతో వాహనాల రాకపోకలకు, కొన్నిచోట్ల నడిచేందుకు వీలు లేకుండా పోతోంది. టవర్‌సర్కిల్ లాంటి అత్యంత రద్దీ ప్రాంతంలోనైతే పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
స్పెషల్ డ్రైవ్ ఎఫెక్ట్ కొద్దిరోజులే...
నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమణల తొలగింపు కోసం నగరపాలక సంస్థ ఇటీవల చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ప్రభావం కొద్దిరోజులు మాత్రమే కనిపిస్తోంది. అధికారులు హడావుడి చేసినన్ని రోజులు కూడా రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఖాళీగా కనిపించడం లేదు. కొద్ది రోజులకే మళ్లీ యథాస్థానంలో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫుట్‌పాత్, రోడ్లు ఆక్రమణలు తొలగించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా, రాజకీయ ఒత్తిళ్లు, కిందిస్థాయి ఉద్యోగుల అలసత్వం, కుమ్మక్కు తదితర కారణాలతో ఆచరణకు పూర్తిస్థాయిలో నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి.
నగరంలోని కరీంనగర్, మంచిర్యాల మెయిన్‌రోడ్డులో ఆదర్శనగర్ ప్రాంతం వద్ద పరిస్థితి ఇది. ఇటీవల నగరపాలకసంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యా పారాలను డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగించారు. కానీ కొద్దిరోజులు సాఫీగా కనిపించిన ఈ రోడ్డు, తొందరలోనే పూర్వస్థితికి చేరింది. షరా మామూలు గానే మళ్లీ ఫుట్‌పాత్‌లే కాదు, రోడ్డుపైకి చొచ్చుకువచ్చి మరీ తమ దందా సాగిస్తున్నారు.
రోడ్లపైనే దందా