
కొత్త పనులకు బ్రేక్
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
కరీంనగర్ అర్బన్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కొత్త పనులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలకు ఆటంకం ఏర్పడటంతో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశించిన వారికి నిరీక్షణ తప్పేలా లేదు. ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మొదటి, రెండో విడతల్లో దాదాపు అన్ని గ్రామాల్లో అర్హులను ఎంపిక చేశారు. పలువురు ఇప్పటికే ప్రారంభించగా రూప్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. బిల్లులు కూడా మంజూరవుతున్నాయి. ఇళ్లు మంజూరైనా కొంతమంది ప్రారంభించేందుకు డబ్బులు లేక, వర్షాకాలం ఇంటి నిర్మాణ సామగ్రిని తరలించేందుకు తదితర ఇబ్బందులతో ప్రారంభించలేదు. వర్షాలు తగ్గిన వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం కింద కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు నిధులు విడుదల చేయడానికి వీలు లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరైన లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వివిధ కారణాలతో ఆలస్యం కాగా ఇందిరమ్మ పథకానికి ఎన్నికల కోడ్ మరో అడ్డంకిగా మారిందని వాపోతున్నారు. తాత్కాలిక నిలిపివేతతో భవన నిర్మాణ కార్మికులకు, సప్లయర్స్‌కు పని దొరకని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఇందిరమ్మ పథకం వివరాలు
దరఖాస్తుదారుల సంఖ్య: 2,04,504
మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు: 8,219
రద్దు చేసుకున్నవారు: 603