
మంత్రి పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలి
కరీంనగర్: ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అసభ్యపదజాలంతో దూషించిన బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ డిమాండ్ చేశారు. సోమవారం సంఘ కార్యాలయంలో మాట్లాడారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మంత్రి వివేక్‌తో ‘దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు’ అని అడ్లూరిని అవమానించేలా పొన్నం అహంకారంగా మాట్లాడడం సరికాదన్నారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ నెల 8న జిల్లావ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం చేస్తామని, 9న పొన్నం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒక దళిత మంత్రిని అవమానించేలా మాట్లాడినప్పుడు మంత్రి వివేక్ కనీసం స్పందించలేదంటే ఆయనకు దళిత పదం బతుకుదెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం ఏమీ ఉపయోగపడరని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొమురయ్య, నవీన్, శంకర్, అంజయ్య, రాజన్న, వరలక్ష్మి, బాబు, సంపత్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.