
పంటలకు తెగుళ్ల బెడద
సుల్తానాబాద్/జూలపల్లి/ఓదెల(పెద్దపల్లి): కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో వరి, పత్తి పంటలకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. వర్షాకాలం ఆరంభంలో ఆలస్యంగా కురిసిన వానులు.. ఇప్పుడు సీజన్ చివరిదశకు వచ్చినా భారీవర్షాలు కురుస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. వీటికితోడు వాతావరణంలో ఆకస్మిక మార్పులతోనూ వరి, పత్తి పంటలకు వివిధ తెగుళ్లు ఆశిస్తున్నాయి. మరో నెలరోజుల్లో పంటలు చేతికి వస్తాయి. ఈ క్రమంలో తెగుళ్లు ఆశించడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీవర్షాలతో వరి పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. గింజదశలోని పంటను ఆశించడంతో దిగుబడి తగ్గుతుందని, అంతేకాకుండా తాలు అధికంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతలను ముంచిన భారీ వర్షాలు
జూలపల్లి మండలంలోని కోనరావుపేట, నాగులపల్లె, కల్లెంరెడ్డిపల్లె, తెలుకుంట తదితర గ్రామాల్లోని వరిపంట కోతదశకు చేరింది. గింజగట్టిపడక ముందే ఏకధాటివానలతో తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగులపల్లె, తెలుకుంట, కల్లెంరెడ్డిపల్లెలో వర్షం ధాటికి దాదాపు 30 ఎకరాల్లో వరిపైరు నేలవాలిందని, గింజలు పనికిరాకుండా పోయానని వాపోతున్నారు.
తెల్లబంగారానికి తెగులు..
ఓదెల మండలంలోని వివిధ గ్రామాల్లో పత్తి పంటకు తెగులు సోకింది. మచ్చతెగుళ్లతో పంట దెబ్బతింటోదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓదెల మండలంలోని 22 గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారని అధికారుల అంచనా. ఇందుర్తిలో 250 ఎకరాలు, పొత్కపల్లిలో వెయ్యి , శాన గొండలో 500, గుంపులలో 350, ఓదెలలో 570, కొమిరలో 320, కొలనూర్‌లో 200, మడకలో దాదాపు 250 ఎకరాల్లో పత్తి సాగైందని, కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటకు నల్లమచ్చలు వస్తున్నాయని, మొక్కలు కుళ్లిపోతున్నాయని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉందని, ఈ సమయంలో కాయలు, బుగ్గలు నల్లగా మారడంతో దిగుబడి తగ్గుతుందని, పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు.. చేను జాలువారి మొక్కలన్నీ ఎర్రబారుతున్నాయని అంటున్నారు.
కొద్దిరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతోనే పత్తి పంటకు తెగులు సోకుతోంది. మొక్కలు, ఆకులు, కాయలపై నల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. తెగుళ్ల నివారణ కోసం అన్నదాతలు రైతువేదికలో ఏఈవోలను తక్షణమే సంప్రదించాలి.
– రామకృష్ణ, ఏఈవో, కొలనూర్, ఓదెల

పంటలకు తెగుళ్ల బెడద