
‘అడవిలో అన్నలు’ సిరిసిల్లలో కలిశారు!
సిరిసిల్ల: సిరిసిల్లకు వచ్చిన మంత్రి సీతక్కను అప్పటి అన్నలు కలిశారు. ములుగు జిల్లాకు చెందిన ధనసరి అనసూర్య ఉరఫ్ సీతక్క 1985–92 ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) జనశక్తిలో దళనేతగా పనిచేశారు. అనంతరం ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం సిరిసిల్లకు వచ్చిన మంత్రిని జనశక్తి మాజీ నక్సల్స్ కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బుర్ర మల్లేశంగౌడ్ ఉరఫ్ కుమారన్న, ఇదే మండలంలోని మల్కపేటకు చెందిన బుట్టం చంద్రయ్య ఉరఫ్ సోమన్న కలిశారు. గతంలో సీతక్కతో కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఇది ఇలాఉంటే 1989లో గ్రెనేడ్‌పేలి సోమన్న చేయి నుజ్జునుజ్జయ్యింది. అనంతరం వ్యక్తిగత కారణాలతో 1995లో ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. మరో నాయకుడు కుమారన్న వరంగల్ జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేశారు. 1989లో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముష్టిపల్లి సర్పంచ్, ఉపసర్పంచగా పనిచేశారు.