
కాలేజీల్లో ‘పేరెంట్స్ మీటింగ్’
● తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేలా..
● నేడు అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం
● సీఎం పేరిట ఆహ్వానపత్రాలు అందజేత
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 51 కళాశాలలు
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంచి ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగా జూనియర్ కళాశాలల్లోనూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం మొదటిసారిగా అన్ని జూనియర్ కళాశాలల్లో ఈనెల 26న(శుక్రవారం) తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం నిర్వహించతలపెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 51 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తల్లిదండ్రుల సమావేశంలో...
● విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, విద్యాప్రగతి, ప్రతిభ, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
● ఇంటర్ విద్యాప్రమాణాల పెంపుదలకు తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.
సీఎం పేరిట ఆహ్వానపత్రం
ఈనెల 26న నిర్వహించే పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)కు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పేరిట ఫొటోతో సహా ఆహ్వానపత్రాలను ఇంటర్‌బోర్డు అధికారులు ముద్రించారు. విద్యార్థుల విజ్ఞాన అభివృద్ధికి నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని పత్రంలో కోరారు. ప్రతీ విద్యార్థికి ఉచిత, నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పిల్లల విద్యాపురోగతి, వ్యక్తిత్వ వికాసం కోసం అందరం కలిసి పనిచేయాలంటే తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరని ఆహ్వానపత్రంలో పేర్కొన్నారు. ఈ ఆహ్వానపత్రాలను అధ్యాపకులు విద్యార్థుల ఇంటికి వెళ్లి సమావేశానికి రావాల్సిందిగా కోరుతూ అందజేశారు.
కళాశాలల వివరాలు
సిరిసిల్ల 10
కరీంనగర్ 11
పెద్దపల్లి 14
జగిత్యాల 16

కాలేజీల్లో ‘పేరెంట్స్ మీటింగ్’