
నాణ్యమైన విద్య అందించాలి
విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లు
మంత్రులు అడ్లూరి, పొన్నం ప్రభాకర్
శాతవాహనలో ఎస్టీ బాలబాలికల వసతి గృహాలకు శంకుస్థాపన
బలహీనవర్గాల చాంపియన్ కాంగ్రెస్
సప్తగిరికాలనీ(కరీంనగర్)/కరీంనగర్ కార్పొరేషన్: విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను అందించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శాతవాహన యూనివర్సిటీలోని బాలికల హాస్టల్ ప్రాంగణంలో ఎస్టీ బాలబాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు హాస్టల్ వసతి అభినందనీయం అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల, కరీంనగర్‌లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మసీ కోర్సులు తీసుకురావడం జరిగిందన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి వీసీ ఉమేశ్ కుమార్, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీవాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వచ్ఛత జీవితంలో భాగమవ్వాలి
జీవితంలో స్వచ్ఛత భాగం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గురువారం నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ఎల్‌ఎండీ కట్టపై ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాథ్ పేరిట నిర్వహించిన శ్రమదానానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కాదన్నారు. ఎల్‌ఎండీ కట్ట వద్ద బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఈ స్థలాన్ని పరిశుభ్రం చేయడానికి ఎంపిక చేశారన్నారు. అనంతరం మంత్రి పొన్నం స్వయంగా చీపురు పట్టి డ్యాం పరిసరాలను ఊడ్చారు. స్వచ్ఛత పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పాల్గొన్నారు.
బలహీనర్గాల అభ్యున్నతికి పాటుపడడంలో కాంగ్రెస్ పార్టీ చాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని గురువారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గిరిజన శిక్షణల్లో కూడా విద్యా అంశాన్ని ప్రధానంగా చర్చించాలన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఆదివాసీలకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు. ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు.