
రౌడీషీటర్లపై నిఘా పెంచాలి
కరీంనగర్‌క్రైం: జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. గురువారం కమిషనరేట్ కేంద్రంలో నేరసమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పోలీసు నూతన లోగోను అధికారికంగా ఆవిష్కరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ తర్వాత సొంత లోగో కలిగి ఉన్న నాలుగో కమిషనరేట్‌గా కరీంనగర్ నిలిచిందని పేర్కొన్నారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లను తరచూ సందర్శించి సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం రవాణా, పేకాటస్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.