
వృద్ధుల ఆశ్రమం సందర్శన
కరీంనగర్‌క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ నగరంలోని ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల ఆశ్రమం, స్వధార్‌హోమ్‌ను శుక్రవారం సందర్శించారు. వృద్ధులు, వికలాంగులతో ముచ్చటించారు. విద్యార్థి దశలో ఎటువంటి లైంగిక వేధింపులకు గురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఆహార పదార్థాలను నిల్వచేసే గదులను తనిఖీ చేశారు. ఎలాంటి న్యాయపరమైన సేవలు అవసరమైనా సంప్రదించాలన్నారు. డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించండి
కరీంనగర్: కార్మికులకు మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. పండగ పూట పంచాయతీ కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెంటనే పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, దసరా సందర్భంగా బట్టలు, సేఫ్టీ పరికరాలను ఇవ్వాలని, గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పునీటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి వడ్లూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు కాశిపాక శంకర్ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ప్రజా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అందె మమతతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లు రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాయకులు ఆకుల నర్సన్న, నిమ్మల అంజయ్య, మల్యాల రాజాగౌడ్, సుందరగిరి గంగరాజు, పెంట శేఖర్, గుండ మల్లేశం, ఆరె మల్లేశం, దుర్గం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుల ఆశ్రమం సందర్శన

వృద్ధుల ఆశ్రమం సందర్శన