
సిటీలో మహిళా బ్లూకోల్ట్స్ సేవలు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు మహిళా బ్లూకోల్ట్స్ సేవలను సీపీ గౌస్ ఆలం శుక్రవారం ప్రారంభించారు. ఎంపిక చేసిన మహిళా పోలీసులకు ప్రభుత్వ స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకంగా మారుతుందని తెలిపారు. తద్వారా బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడం వంటి విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు.
మహిళా పోలీసులతో బాధితులకు ఆత్మస్థైర్యం
పోలీసుశాఖలో 33శాతం మహిళా నియామకాలు జరుగుతుండడంతో బాధిత మహిళలకు ఆత్మస్థైర్యం లభిస్తుందని సీపీ గౌస్‌ఆలం అన్నారు. మహిళా పోలీసు సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శుక్రవారం ‘సేఫ్ హాండ్స్ విత్ తెలంగాణ పోలీస్– నారి శక్తి ఇన్ కరీంనగర్ పోలీస్’ అనే నినాదంతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తామన్నారు. ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ కరీంనగర్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేశ్ బృందం ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు సీపీఆర్‌పై శిక్షణ అందించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్‌జి, వెంకటస్వామి, సీఐలు శ్రీలత, స్వర్ణజ్యోతి పాల్గొన్నారు.