
వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయండి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో వనమహోత్సవం లక్ష్యాన్ని పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వన మహోత్సవం లక్ష్యాన్ని, నాటిన మొక్కల సంఖ్యను సమీక్షించారు. ప్రతిశాఖకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని, మొక్కలకు జియో టాకింగ్ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో కామన్ డైట్ మెనూ అమలు చేసేందుకు కావలసిన వివిధ సరుకులకు సంబంధించి ఈ ఏడాది టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని భవిత, కేజీబీవీలలో భవనాల మరమ్మతులు, సదుపాయాల పనులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, డీఆర్‌డీవో శ్రీధర్, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ నాగలేశ్వర్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తాత్కాలిక పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీఏఎస్(ఐసీయూ) స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వచ్చే నెల 1వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయుద్దీన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 14 మంది ప్రొఫెసర్లు, 33 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు సీఏఎస్ స్పెషలిస్టు, 48 మంది సినియర్ రెసిడెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల వెబ్‌సైట్ https://www.gmcknr.com/gmc knr. htmlwww. gmcknr.com నుంచి దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలు పూరించి సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఈ నోటిఫికేషన్‌ను సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం సాయంత్రం నుంచి కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ నియమావళి ఆధారంగా నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
‘చేసింది గోరంత.. ప్రచారం కొండంత’
గన్నేరువరం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో అమలు చేసింది గోరంత అయితే.. ప్రచారం కొండంత చేసుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గన్నేరువరంలో పార్టీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ అధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశానికి హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాలు ప్రదర్శిస్తోందని విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు ఆగస్టులో పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందులో నాయకులు, కార్యకర్తలు పాల్గొని, బీజేపీని గడపగడపకు తీసుకెళ్లాలని తెలిపారు.

వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయండి