
ఉన్నత విద్యకు వరం
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి
● దళిత విద్యార్థులకు చక్కని అవకాశం ● రూ.20లక్షల వరకు రుణ సదుపాయం ● పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం
కరీంనగర్: దళిత విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఓ వరం లాంటిది. 2025 విద్యా సంవత్సరానికి విదేశాల్లో ఉన్నత చదువులు, ప్రత్యేక కోర్సులు పూర్తి చేసేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ద్వారా అమలవుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఒక్కో విద్యార్థికి రూ.20లక్షల వరకు అందిస్తోంది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎంపిక చేస్తూ అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను బట్టి రుణం మంజూరు చేస్తారు. డిగ్రీ అనంతరం పీజీ, వైద్యవిద్య, ఎరోనాటికల్ విద్యకు ప్రాధాన్యం ఉంది. డిగ్రీలో 60శాతానికి పైగా మార్కులు కలిగి ఉండాలి. విదేశాల్లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశ పత్రం పొంది ఉండాలి. జీఆర్‌ఈ, టొఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఎంఏటీ తదితర లాంగ్వేజీ కోర్సుల్లో అర్హత సాధించి ఉండాలి. జాతీయ బ్యాంక్ అకౌంట్, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు ఉండాలి. వీటితో పాటు విద్యా సంవత్సరంలో గ్యాప్ ఉంటే దానికి సంబంధించిన వివరాలు, మీసేవ ద్వారా పొందిన కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. వార్షికాదాయం గతంలో రూ.2 లక్షలు మాత్రమే ఉండాలన్న నిబంధనను సడలించి, రూ.5లక్షల వరకు పెంచారు. ఈ సంవత్సరం ఎక్కువ మందిని పంపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఎస్సీ సంక్షేమశాఖ నుంచి విరివిరిగా ప్రచారం చేస్తున్నారు. యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించారు. పథకం తీరుతెన్నులపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో ఆశించిన మేరకు దరఖాస్తులు రావడం లేదని సమాచారం.
సద్వినియోగం చేసుకోవాలి
దళిత విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసేందుకు ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని సద్వి నియోగం చేసుకుని భవిష్యత్‌లో రాణించాలి. విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ వరకు www.telangana. epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పథకంపై ఎస్సీ నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయి అవగాహన క ల్పిస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారికి హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. – నగైలేశ్వర్,
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి

ఉన్నత విద్యకు వరం