
నగరంలో నాఖాబందీ
కరీంనగర్‌క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సీపీ గౌస్‌ఆలం ఆధ్వర్యంలో శని వారం రాత్రి 10గంటలకు నగరంలో మెరుపు నాఖాబందీ చేపట్టారు. 20 ప్రధాన కూడళ్ల వద్ద సుమారు 150మంది పోలీసులు తనిఖీల్లో పా ల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్యాంపరింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీ లు చేపట్టామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలను సీపీ కోరారు.
అన్ని డివిజన్లలో వార్డు కార్యాలయాలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోన్ని అన్ని డివిజన్లలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరంలోని 10,11 డివిజన్లకు చెందిన వార్డు కార్యాలయాలను సందర్శించారు. 11వ డివిజన్ పరిధిలోని న్యూశ్రీనగర్ కాలనీలో పిల్లలపార్క్‌ను, 12వ డివిజన్ వార్డు కార్యాలయాన్ని పరిశీలించారు. 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. మహిళా సంఘం భవనాన్ని సందర్శించారు. సప్తగిరికాలనీ వాసులకు వైద్య సేవలందించేందుకు అర్బన్ హెల్త్ సెంటర్‌కు సొంతభవం సమకూరుస్తున్నట్లు తెలిపారు. న్యూ శ్రీనగర్ కాలనీలోని పిల్లల పార్క్‌లో చెడిపోయిన వాటర్ ఫౌంటెన్, ఓపెన్ జిమ్ పరికరాలకు మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని స్పోర్ట్స్‌స్కూల్‌కు హెలిక్యాప్టర్ ద్వారా చేరుకొంటారు. మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నంకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి సాయంత్రం 4 గంటల వరకు కొత్త రేషన్‌కార్డుల పంపిణీతో పాటు, గట్టుదుద్దెనపల్లిలోని విత్తననిల్వ గోదామును స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30కు చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగుకు చేరుకొని 5.30 గంటల వరకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తారు. 5.30 గంటలకు రామగుడు నుంచి బయలుదేరి 6 గంటలకు కరీంనగర్‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ స్తంభాల పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ. పీటీసీ ఫీడర్ పరిధిలోని మార్క్‌ఫెడ్ ముందు, శ్రీహరినగర్, సంతోశ్‌నగర్, గణేష్‌నగర్, కుర్మవాడ, బడిగుడి, పిటిసీ, బుల్‌స్టేషన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
బల్దియా డీసీకి షోకాజ్ నోటీసు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్‌కు మున్సిపల్ పరిపాలనశాఖ జాయింట్ డైరెక్టర్ ఫాల్గున్‌కుమార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నగరపాలకసంస్థ పరిధిలో ఆమోదించిన సెల్ఫ్ అసెస్‌మెంట్ల వివరాలను వారంరోజుల్లో సమర్పించాలని ఆదేశించినా, నివేదిక సమర్పించకపోవడంతో షోకాజ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. షోకాజు అందుకున్న మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, సెల్ఫ్ అసెస్‌మెంట్ పేర్లు, వివరాలు ఇవ్వాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నగరంలో నాఖాబందీ