
‘ఇందిరమ్మ’ అనర్హులకు చెక్
● పీఎం ఆవాస్ యోజన యాప్ ద్వారా గుర్తింపు ● ఎల్–1 జాబితా అర్హుల వివరాలపై రీసర్వే
కరీంనగర్‌రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేయగా కొత్తగా పీఎం ఆవాస్ యోజన యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతనెల15నుంచి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం రెండురోజులక్రితం ఎల్–1 జాబితాలోని అర్హుల వివరాలపై మరోసారి సమగ్ర విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో అర్హుల వివరాలను సేకరిస్తున్నారు.
యాప్‌లో సమగ్ర వివరాల నమోదు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాలతో పాటు రెండో విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్ధిదారుల వివరాలను కార్యదర్శులు సేకరిస్తున్నారు. గతనెల15నుంచి లబ్ధిదారు పేరు, చిరునామా, ఆధార్‌కార్డు నంబరు, బ్యాంకుఖాతా, ఉపాధిహామీ కూలీ అయితే జాబ్‌కార్డు వివరాలు నమోదు చేస్తున్నారు. 400 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఇంటి కొలతలు తీసుకుని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడం, యాప్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో లబ్ధిదారుల వివరాల నమోదులో జాప్యమేర్పడుతోంది. కొందరు లబ్ధిదారుల ఆధార్, ఐరిస్‌తో ఫొటో సరిపోవడం లేదు. మరికొందరి ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోవడంతో సాంకేతికంగా తీసుకోవడంలేదు. పూర్తి వివరాలను నమోదు చేసినప్పటికి సర్వర్ మొరాయిస్తుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. ముందుగా ఎంపికై న లబ్ధిదారుల వివరాల సర్వే గత నెల 31వరకు పూర్తి చేయాల్సి ఉండగా ఎల్–1 జాబితాలోని అర్హులను సర్వే చేయాలనే ఆదేశాలతో ఆదివారం వరకుగడువు పొడిగించారు. గడువులోగా సర్వే పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం గడువు పెంచే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
ఎల్– 1జాబితా అర్హుల రీసర్వే
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పీఎం ఆవాస్‌యోజన సర్వే నడుస్తోంది. ప్రభుత్వం కొత్తగా ఎల్– 1 జాబితాలోని అర్హులపై రీసర్వే చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో సర్వేలో కొంత జాప్యమవుతోంది. నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం.
– ఎస్.రాజేశ్వర్, ప్రాజెక్టు డైరెక్టర్,
జిల్లా గృహ నిర్మాణ సంస్థ
పీఎం ఆవాస్ యోజన సర్వే వివరాలు
జిల్లాలో గ్రామ పంచాయతీలు 318
సర్వే చేస్తున్న గ్రామ పంచాయతీలు 305
సర్వే ప్రారంభించని గ్రామ పంచాయతీలు 13
ఎల్– 1అర్హులు 49,470
రద్దు చేసిన ఇళ్లు 863
మొత్తం లబ్ధిదారులు 48,607
సర్వే పూర్తయినవి 5,915
సర్వే పూర్తి చేయాల్సినవి 42,692