
‘ఐవీఎఫ్’లపై స్పెషల్ డ్రైవ్
● నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ● ఇప్పటివరకు 43 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ● జిల్లా వైద్యాధికారి వెంకటరమణ
కరీంనగర్‌టౌన్: వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్లపై జిల్లాస్థాయి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆక్ట్ (ఎంటీపీ ఆక్ట్), అసిస్టెడ్ ప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ), సరోగసీ చట్టాల నిబంధనలను పాటించని సెంటర్లపై కొరడా ఝుళిపించనున్నారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం– 1994 ప్రకారం నడుచుకోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను గుర్తించి చర్యలు చేపట్టనున్నారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండి ఆదాయం లేని కొన్ని నర్సింగ్ హోమ్‌లు, పెర్టిలిటీ కేంద్రాలతో ఎవరికీ అనుమానం రాకుండా లింగనిర్ధారణ జరుపుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ప్రైవేటు ప్రాక్టీషనర్లు మధ్యవర్తులుగా ఉండి ఆడపిల్లలకు మరణశాసనం లిఖిస్తున్నారు. ఈ తంతును అరికట్టేందుకు వైద్యారోగ్యశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
అడ్వైజరీ కమిటీ సమావేశం
లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. బుధవారం డీఎంహెచ్‌వో చాంబర్‌లో జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. డీఎంహెచ్‌వో లింగ నిర్ధారణ నిషేధచట్టం అమలు తీరును సమీక్షించారు. ఇటీవల ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీకి సంబంధించిన పలు కేసులు బయటపడుతుండడంతో జిల్లాలోని ఐవీఎఫ్ సెంటర్లపై దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో 15 సెంటర్లు రిజిస్టర్ అయి ఉండగా, వాటిలో 4 లెవల్–1, మిగిలినవి లెవల్–2గా నమోదు అయ్యాయని వెల్లడించారు. అదనంగా వచ్చిన కొన్ని కొత్త దరఖాస్తులను ఆమోదం కోసం రాష్ట్రస్థాయిలో ప్రక్రియలో ఉన్నాయన్నారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని అతిక్రమించిన 43 స్కానింగ్ సెంటర్లకి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధిస్తారని వెల్లడించారు.
అక్రమాలకు పాల్పడితే సీజ్ చేస్తాం
జిల్లాలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పా టించని వారికి నోటీసులు జారీ చేస్తాం. గడు వు ప్రకారం సమాధానం చెప్పనట్లయితే సీజ్ చేస్తాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతా యి. ఐవీఎఫ్, సరోగసీలో అక్రమాలు, లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.– వెంకటరమణ, డీఎంహెచ్‌వో