‘సింగరేణి’ రద్దుతో ఇబ్బందులు
● కాగజ్‌నగర్ – భద్రాచలంరోడ్డు మధ్య ఒకేరైలు ● 29 వరకు ఇరువైపులా రాకపోకలు బంద్ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
రామగుండం: సిర్‌పూర్ కాగజ్‌నగర్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్య సింగరేణి ప్యాసింజర్(రైలు నంబరు 17033/17034)రాకపోకలు సాగిస్తోంది. కాగజ్‌నగర్ – భద్రాచలంరోడ్ మధ్య సుమారు 315 కి.మీ. దూరం ఉంటుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు రామగుండంలో బయలుదేరి రాత్రి 8.20 గంటలకు భద్రాచలం రోడ్డు స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణ చార్జీ ఒక్కొక్కరికి రూ.150 మాత్రమే. దీంతో సాధారణ ప్రయాణికులు ఇందులో ప్రయాణించేందుకే మొగ్గుచూపుతారు. ఈ రైలు రద్దయినా, ప్రయాణికులు మిస్ అయినా.. రోడ్డుమార్గం తప్ప మరోదారిలేదు. ఇలా వెళ్తే ఒక్కో వ్యక్తికి కనీసం రూ.800 వరకు ప్రయాణ చార్జీ అవుతోంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, వరంగల్, కేసముద్రం, డోర్నకల్.. ఇలా కోల్‌బెల్ట్ ప్రాంతాల మీదుగా భద్రాచలంరోడ్డుకు ప్రయాణం సాగిస్తోంది. అందుకే దీనికి సింగరేణి అని నామకరణం చేశారు. ఈ రైలులో అత్యధికంగా సింగరేణి కార్మిక కుటుంబాలు ప్రయాణిస్తుంటాయి.
29 వరకు ఇరువైపుల రద్దు..
మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్, రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఇరువైపులా సింగరేణి రైలును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో ఎక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టినా అధికారులు సింగరేణి ప్యాసింజర్ రైలును రద్దు చేయడం సర్వసాధారణంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రైల్వేశాఖ నిర్ణయంపై సింగరేణి కార్మికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
‘సింగరేణి’ రద్దుతో ఇబ్బందులు


