భయాందోళన వద్దు
● జెన్–1 ప్రాణాంతక వేరియంట్ కాదు ● సాధారణ ఫ్లూ, జలుబు లక్షణాలతో ఉంటుంది ● లక్షణాలున్నవారు ఐసోలేట్ అయితే సరిపోతుంది ● వైరస్ వ్యాప్తిచెందినా ఎదుర్కొనేందుకు సిద్ధం ● ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో డీఎంహెచ్‌వో వెంకటరమణ
కరీంనగర్‌టౌన్: దేశంలో కరోనా కేసులు నమోదవుతు న్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలోనూ ఒక కేసు నమోదైనట్లు తెలుస్తుండగా.. జెఎన్–1 వైరస్ భయం ప్రజలను వణికిస్తోంది. ఆందోళన అవసరం లేదని వైద్యాధికారులు సూచిస్తున్నప్పటికీ ప్రజలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చిన్న జ్వరానికే భయపడుతున్నారు. వారి ఆందోళనలను తొలగించేందుకు జిల్లా వైద్యాధికారి వెంకటరమణతో శుక్రవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. పలువురు అడిగిన ప్రశ్నలకు డీఎంహెచ్‌వో సమాధానం ఇచ్చారు.
కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి?
– శంకర్, వావిలాలపల్లి, కరీంనగర్
డీఎంహెచ్‌వో: పాత వైరస్ ప్రాణాంతకంగా ఉండేది. 2019 కరోనా వేరియంట్‌కు, ఇప్పటి జెఎన్–1కు చాలా తేడా ఉంది. ప్రస్తుతం వచ్చే సాధారణ ఫ్లూ, జలుబు, దగ్గు, డయేరియా, కళ్ల మంటలు వంటి లక్షణాలు ఉంటున్నాయి. పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.
కరీంనగర్‌లో పరిస్థితి ఎలా ఉంది?
– వెంకటేశ్వర్లు, కాపువాడ, కరీంనగర్
డీఎంహెచ్‌వో: తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదైందని తెలుస్తోంది. ఒక వేళ కేసులు పెరిగినా ప్రమాదకర పరిస్థితులు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, పిల్లలు, బీపీ, షుగర్, గుండెజబ్బులు ఉన్న వాళ్లు లక్షణాలు కనిపిస్తే ఐసోలేట్ అయి చికిత్స తీసుకోవాలి.
కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు చేపడతారు?
– ఆంజనేయులు, కొత్తపల్లి
డీఎంహెచ్‌వో: ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్, వైద్యులు, మందులు సిద్ధంగా ఉన్నాయి. ఏడాదికోసారి మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నాం. అన్ని ఆరోగ్యకేంద్రాల వైద్యులు, సిబ్బందిని అలర్ట్ చేశాం. గత అనుభవంతో వైద్యులు చికిత్స పద్ధతులు కూడా తెలుసుకున్నారు. లక్షణాలు ఉంటే ఆరోగ్యకేంద్రాలను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. తగ్గని జ్వరం, శ్వాస సమస్యలుంటే ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అడ్మిట్ అయితే మెరుగైన చికిత్స అందిస్తాం.
కరోనా పేషెంట్‌కు ఎలాంటి చికిత్స అందిస్తారు?
– మల్లేశం, రాంనగర్, కరీంనగర్
డీఎంహెచ్‌వో: ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ కరోనా కేసులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఫారిన్ ట్రావెల్ నుంచి వచ్చిన వారుంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలి. గతంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ప్రస్తుతం వచ్చే వేరియంట్‌తో పెద్దగా ప్రమాదం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం.
వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– సత్యనారాయణ, చొప్పదండి
డీఎంహెచ్‌వో: కరోనా వైరస్ సోకితే ఆసపత్రికి వెళ్లి వైద్యం తీసుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే ఐసోలేట్ కావాలి. సాధారణ జలుబు, జ్వరం వచ్చినా ఐసోలేట్ కావడం మంచిది. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం అలవాటుగా చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటూ చికిత్స పొందితే మూడు నాలుగు రోజుల్లోనే నయమవుతుంది.
ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు?
– రాంచంద్రం, మానకొండూర్
డీఎంహెచ్‌వో: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కల్పిస్తున్నాం. దోమలు పెరగకుండా మంగళవారం, శుక్రవారం డ్రైడేలు నిర్వహించాలని సూచిస్తున్నాం. పరిశుభ్రమైన వాతావరణం ఇంటి పరిసరాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. దోమల నివారణ జరిగితే సగం వ్యాధులు దూరమవుతాయి. కరోనా సమయంలో మామూలు జ్వరానికి కూడా భయపడే ప్రమాదం ఉంది. కాబట్టి జ్వరాల నియంత్రణకు త్వరలో ఇంటింటి సర్వే చేపడతాం.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా వస్తుందా?
– జయచందర్, హుజూరాబాద్
డీఎంహెచ్‌వో: 2019 కోవిడ్ వేరియంట్ కోసం అప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడంతో ప్రజలందరూ తీసుకున్నారు. ఒక వేరియంట్‌కు తయారుచేసిన వ్యాక్సిన్ మరో వేరియంట్‌కు పనిచేయడం కష్టం. ప్రస్తుతం జెఎన్–1 వేరియంట్ ఎలాంటి ఇబ్బంది పెడుతుందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో అన్ని వేరియంట్లకు ఒకే రకమైన వ్యాక్సిన్ రూపొందించేందుకు పరిశోధనలు జరుగుతున్న తెలిసింది.
వైరస్ వ్యాప్తి గురించి ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ ఉన్నాయా?
– రాజేందర్, తిమ్మాపూర్
డీఎంహెచ్‌వో: మహరాష్ట్ర, కేరళ, తమిళనాడులో కరోనా కేసులు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మా త్రం ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. వైరస్ కూడా అంత ప్రమాదకరం కాదని తెలియడంతో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి గైడ్‌లైన్స్ ఇవ్వలేదు. డబ్ల్యూహెచ్‌వో కూడా ఆందోళన అవసరం లేదనే సూచిస్తోంది. అయినా డీహెచ్ ఆదేశాల మేరకు వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.
భయాందోళన వద్దు


