● వీసీలో నాకో డైరెక్టర్, కేంద్ర అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ గుప్తా
● పాల్గొన్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, ముందస్తు గుర్తింపునకు అన్నిశాఖల అధికారులు పూర్తి సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) సంచాలకులు, కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ గుప్తా సూచించారు. బుధవారం నిర్వహించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయి పరీక్షలు, చికిత్స, పర్యవేక్షణపై ఉన్నతాధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు సంరక్షణలో భాగంగా ప్రతి గర్భిణికి నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం హెచ్ఐవీతోపాటు సిఫిలిస్, హెపటైటిస్–బీ పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష ఫలితాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ, బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్తోపాటు సత్వర వైద్య సేవలు, ఏఆర్టీ చికిత్స అందేలా చూడాలన్నారు.
లక్ష్యాలకు అనుగుణంగా నిధులు వెచ్చించాలి
జిల్లాలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, ఎస్సీ అభివృద్ధి నిధుల బడ్జెట్ విడుదల, ఇప్పటివరకు చేసిన ఖర్చులు, పనుల పురోగతిపై శాఖల వారీగా కలెక్టర్ చర్చించారు. అదనపు కలెక్టర్ విక్టర్, శిక్షణ కలెక్టర్ రవి తేజ, జిల్లా ప్రణాళిక అధికారి రఘునందన్, డీఈవో మల్లికార్జున్, మత్స్యశాఖ అధికారి లాయక్ మొయినుద్దీన్, డీపీవో మురళి, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్ పాల్గొన్నారు.


