చి‘వరి’కి చింతే! | - | Sakshi
Sakshi News home page

చి‘వరి’కి చింతే!

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

చి‘వరి’కి చింతే! పూడికతీతకు నిధులు కరువు.. చివరి తడి అవసరం.. అధికారులు స్పందించాలి రైతుల భాగస్వామ్యం అవసరం

పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ 1 (డీ1) నుంచి డిస్ట్రిబ్యూటరీ 73 (డీ73) వరకు ప్రభుత్వ రికార్డుల ప్రకారం 10,500 ఎకరాల సేద్యపు భూమి ఉంది. పోచారం ప్రాజెక్ట్‌ ఏ జోన్‌ అయిన నాగిరెడ్డిపేట మండలంలో 6,694 ఎకరా లు, బీ జోన్‌ అయిన ఎల్లారెడ్డి మండలంలో 3,806 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రాజెక్టు నీరు ఆధారంగా దీనికి రెట్టింపు విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. ఎల్లారెడ్డి మండలంలో సబ్దల్‌పూర్‌ డీ 45 డిస్ట్రిబ్యూటరీ నుంచి ఆజామాబాద్‌ డీ 73 డిస్ట్రిబ్యూటరీ వరకు ఆయకట్టు ఉంటుంది. అయితే కాలువ నిండా పిచ్చిమొక్కలు పేరుకుపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది. ప్రధాన కాలువ ఆయకట్టు కింద జంగమాయిపల్లి, మత్తమాల, రుద్రారంలలోని కాలువలలో ఇసుక మేటలు, పిచ్చి మొక్కలు, గడ్డి విపరీతంగా పెరిగిపోయి నీరు రావడం లేదు.

ప్రధాన కాలువలో ఇసుక మేటలు, పిచ్చి మొక్కలు నిండిపోయి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తున్నాయి. ఏటా కాలువలో చేపట్టాల్సిన పూడికలను క్రమం తప్పకుండా తీయకపోవడంతో నిరోధకాలు పెరిగి, నీరు రావడం లేదు. కాలువ గండ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులిస్తుంది కానీ పూడికతీతకు ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. ఆయా గ్రామాల ఆయకట్టు రైతులే తమ పరిధిలోని కాలువలను శుభ్రం చేసుకుని నీరు సాఫీగా వచ్చేలా చేసుకోవాలంటున్నారు. ప్రాజెక్ట్‌ నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని వదిలితే చివరి ఆయకట్టు వరకు చేరుతుందని రైతులు పేర్కొంటుండగా.. ఎక్కువ నీటిని వదిలితే ప్రాజెక్ట్‌ ఖాళీ అవుతుందని అధికారులు అంటున్నారు. అవరోధకాలతో మొదటి డిస్ట్రిబ్యూటరీల పరిధిలోనే కాలువలోకి నీరు రాని పరిస్థితి ఉంది. ఇన్నాళ్లు అడపాదడపా కురిసిన వర్షాలతో ఇబ్బంది ఎదురవలేదు. అయితే ఇప్పుడు ఎండలు ముదురుతుండడంతో కాలువ నీటి అవసరం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి పోచారం కాలువలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగింపజేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రధాన కాలువ కింద పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో చివరి తడి అవసరం. కానీ కాలువలో నీరు చూస్తే బతుకమ్మలు కూడా మునుగుతలేవు. పంట ఎలా గట్టెక్కుతుందో తెలియడం లేదు.

– రత్నం, రైతు, జంగమాయిపల్లి

ప్రధాన కాలువలో నీరు సాఫీగా రాకపోవడానికి ఇసుక, పిచ్చి మొక్కలు, గడ్డి విపరీతంగా పెరిగిపోవడమే కారణం. వాటిని తొలగించాల్సిన ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలి.

– జైలు, రైతు, మత్తమాల

కాలువలను బాగు చేసుకోవడంలో రైతుల భాగస్వామ్యం ఎంతో అవసరం. పోచారం ప్రాజెక్ట్‌ నుంచి రోజూ 250 క్యూసెక్కుల వరకు నీటిని ప్రధాన కాలువలోకి వదులుతున్నాం. ఇంతకంటే ఎక్కువ నీటిని వదిలితే ప్రాజెక్ట్‌ త్వరగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

– వెంకటేశ్వర్లు, డీఈ, ఇరిగేషన్‌, ఎల్లారెడ్డి డివిజన్‌

పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అధ్వానంగా మారింది. పిచ్చిమొక్కలతో నిండిపోయి చివరి ఆయకట్టుకు నీరందడం గగనంగా మారింది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండడంతో నీరందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. – ఎల్లారెడ్డి

అధ్వానంగా పోచారం ప్రధాన కాలువ

నీటి పారకానికి అడ్డుపడుతున్న

పిచ్చిమొక్కలు

పట్టించుకోని అధికారులు

ఆందోళనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement