అవయవదానంతో నలుగురికి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో నలుగురికి పునర్జన్మ

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

లక్డీకాపూల్‌: కామారెడ్డికి చెందిన ఓ వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్‌ కాగా, అవయవ దానంతో నలుగురు రోగులకు పునర్జన్మ లభించింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని రాజానగర్‌ నివాసి పవన్‌ కుమార్‌ జాజు (39) వృత్తిరీత్యా వ్యాపారవేత్త. కొన్ని రోజులుగా తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్‌ హెమరేజ్‌ (మెదడులో రక్తస్రావం) కావడంతో ఈనెల 7న కామారెడ్డిలోని ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతటి విషాద సమయంలోనూ పవన్‌ కుమార్‌ కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో అతడి రెండు కిడ్నీలు, లివర్‌ (కాలేయం), ఊపిరితిత్తులను నలుగురు రోగులకు అమర్చి వారి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా జీవన్‌దాన్‌ తెలంగాణ ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ భూషణ్‌ రాజు మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నిర్ణయం స్ఫూర్తిదాయకమన్నారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అవసరమైన వారికి సేవలు అందించేందుకు జీవన్‌దాన్‌ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement