లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు నిర్వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు నిర్వహించొద్దు

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు నిర్వహించొద్దు రేపు కలెక్టరేట్‌లో జాబ్‌మేళా 18న ఫుట్‌బాల్‌ టాలెంట్‌ హంట్‌ బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యవర్గం గుడ్ల టెండర్‌ బిడ్ల పరిశీలన పూర్తి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం అవసరమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు నిర్వహించవద్దని జిల్లా ఆహార భద్రత అధికారి విక్రమ్‌ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గల దుకాణాలు, హోటళ్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించి వాటిని పారవేయించారు. పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. లైసెన్స్‌లు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.

కామారెడ్డి టౌన్‌: నిరుద్యోగ యువతకు ప్రయివేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు గురువారం కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. స్వతంత్ర మైక్రోఫిన్‌ లిమిటెడ్‌ సంస్థలో ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల (చేర్యాల బ్రాంచ్‌లో 10, రామాయంపేటలో 10, మాచారెడ్డి బ్రాంచ్‌లో 5) భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్‌తో కలెక్టరేట్‌ మొదటి అంతస్తులోని రూం నంబర్‌ 121 లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, పూర్తి వివరాలకు 89856 12908, 63057 43423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కామారెడ్డి అర్బన్‌: నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో ఈనెల 18న ఫుట్‌బాల్‌ క్రీడాకారుల టాలెంట్‌ హంట్‌ నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ, ఇండియా ఖేలో ఫుట్‌బాల్‌ల ఆధ్వర్యంలో యువ ఫుట్‌బాల్‌ క్రీడాకారులను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. పోటీలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా క్రీడాకారులు హాజరు కావాలని సూచించారు. ఆసక్తిగలవారు ముందుగా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌: బీజేపీ మహిళా మోర్చా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు మోర్చా జిల్లా అధ్యక్షురాలు పావనిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా హారిక, సుజాత, రేణుకాగౌడ్‌, ప్రధాన కార్యదర్శులుగా రాథోడ్‌ సునీత, వినోద, కార్యదర్శులుగా వెన్నెల, కవిత, రజిత, ఐశ్వర్య, కోశాధికారిగా సుశీల నియమితులయ్యారని పేర్కొన్నారు. మీడియా కన్వీనర్‌గా సుజాత, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా సునంద, ఐటీ కన్వీనర్‌గా అంకిత, కార్యాలయ కార్యదర్శిగా లక్ష్మి, కన్వీనర్‌గా స్వరూప, పాలసీ–రీసెర్చ్‌ కన్వీనర్‌గా సవిత, మైనారిటీ విభాగం కన్వీనర్‌గా విజయలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జయమ్మ, ప్రమీల, శ్వేత, స్వప్న, లక్ష్మిలను నియమించినట్లు తెలిపారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని సంక్షేమ, గురుకుల వసతి గృహాలకు గుడ్ల సరఫరాకు సంబంధించి నిర్వహించిన టెండర్లలో బిడ్ల పరిశీలన పూర్తయ్యింది. టెండర్లలో పాల్గొన్న వివిధ సంస్థలు, సరఫరాదారులు సమర్పించిన సాంకేతిక బిడ్లు, ధ్రువపత్రాలను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధ్యక్షతన కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. తదుపరి టెండర్‌ ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, డీఈవో మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement