బాన్సువాడ : రాబోయే రోజుల్లో ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు ప్రభావం ఉండనున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ప్రజలు ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. తాడ్కోల్ డబుల్ బెడ్ రూం కాలనీలో ప్రభుత్వం రూ. 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిమందితో కమిటీ వేసి కొత్త ఫంక్షన్ హాల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. 500 కుర్చీలు, 1,500 మందికి సరిపడా వంట పాత్రలు, మైక్ సిస్టమ్‌కు మరో రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో 75 మంది లబ్ధిదారులు ఉండడం లేదని, కొంత మంది ఇళ్లను అమ్ముకున్నారని తెలిసిందని, వాటిని అర్హులైన వారికి ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


