యాసంగికి ప్రణాళిక సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

యాసంగికి ప్రణాళిక సిద్ధం!

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

యాసంగికి ప్రణాళిక సిద్ధం! వరి సాగును తగ్గించేందుకు..

యాసంగి సాగు ప్రణాళిక ఎకరాల్లో..

● ఎల్‌నినో ప్రభావంతో

వరి సాగుకు కత్తెర

● 85 వేల ఎకరాల్లో తగ్గే అవకాశం

● ఆరుతడి పంటలకే ప్రాధాన్యం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 2026–27 యాసంగి పంటల సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎల్‌నినో ప్రభావం, భూగర్భజలాల సమస్యకు తోడు ఎండలు, కరెంటు సమస్యలను అధిగమించాలంటే నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగు తగ్గించాల్సిందేనని పేర్కొంటున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో కన్నా ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గే అవకాశం ఉంది. గతేడాది యాసంగి సీజన్‌లో 4,29,560 ఎకరాల్లో పంటలు సాగవ్వగా, ఈసారి యాసంగిలో 3,98,330 ఎకరాలకు పరిమితం కావొచ్చని అంచనా వేస్తున్నారు.

తక్కువ నీటితో సాగయ్యే..

రాష్ట్రమంతటా ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం కురిసినా కామారెడ్డి జిల్లాలో సాధారణంగా నమోదైంది. ఆదివారం వరకు 837.9 మి.మీ. వర్షపాతం కురిసింది. ఇది సాధారణ వర్షాపాతానికి సమానంగా ఉంది. గతేడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో ఈ సమయానికి 1375.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈసారి సాధారణ వర్షాపాతం నమోదైనప్పటికీ చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. పోచారం, కౌలాస్‌ ప్రాజెక్టులు నిండగా, నిజాంసాగర్‌కు పూర్తిస్థాయిలో రాలేదు. ఇదే సమయంలో ఎల్‌నినో ప్రభావంతో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వ్యవసాయ శాఖ ప్రణాళికలో ప్రస్తావించింది. స్ప్రింక్లర్‌, డ్రిప్‌ వంటి సూక్ష్మ సేద్య పరికరాలకు రాయితీలు అందించడం, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయడం వంటి చర్యలను సూచించింది. అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు సోలార్‌ ఫెన్సింగ్‌కు ఆర్థిక చేయూత అందించాలని కూడా వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

పంట 2025–26 2026–27

సాగు అంచనా

వరి 2,55,904 1,71,000

జొన్న 86,722 95,000

మక్క 41,090 49,000

శనగ 35,621 66,000

సన్‌ఫ్లవర్‌ 3,171 4,000

జిల్లాలో గతేడాది యాసంగి సీజన్‌లో 2,55,904 ఎకరాల్లో వరి పంట సాగైంది. ఈ సారి 1,71,000 ఎకరాలకే పరిమితం కావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా దాదాపు 85 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గనుందని భావిస్తున్నారు. మరోవైపు జొన్న సాగు 86,722 ఎకరాల నుంచి 95 వేల ఎకరాలకు పెంచాలని , మక్క 41 వేల నుంచి 49 వేల ఎకరాలకు పెంచేలా రైతులను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. అలాగే శనగ సాగుపై రైతులు మరింత దృష్టి సారించేలా అవగాహన కల్పించనున్నారు. గత యాసంగిలో 35,621 ఎకరాల్లో శనగ పంట సాగవగా, ఈ సారి 66 వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తున్నారు. ఓ రకంగా రెట్టింపు సాగవుతుందని భావిస్తున్నారు. అలాగే పొద్దు తిరుగుడు, కుసుమ పంటల సాగు విస్తీర్ణం పెరగనుంది. కూరగాయల సాగు, ఉల్లి, పండ్లు, ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement