భిక్కనూరు: ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కంపు కాలుష్యం తాము అనుభవిస్తుంటే, సీఎస్‌ఆర్ నిధు లు మాత్రం పట్టణాలకు కేటాయిస్తున్నారంటూ భిక్కనూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఏర్పాటైన కెమికల్, ఫార్మా కంపెనీలు విడు దల చేసే వృథా జలాలతో భూగర్భజలాలు కలుషితమవుతుండగా, ఆయా కంపెనీలు నుంచి వస్తున్న దుర్వాసనతో రోగాలబారిన పడుతున్నామని పేర్కొంటున్నారు. జంగంపల్లి, భిక్కనూరు, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, తలమడ్ల, ఆరేపల్లి, బస్వాపూర్, శ్రీసిద్ద రామేశ్వరనగర్ గ్రామాల ప్రజలు ఫార్మా, ఐరన్, పౌల్ట్రీ తదితర పరిశ్రమలు విడుదల చేసే దుర్వాసనతో అనునిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలుష్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీలు తమ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టకుండా కామారెడ్డి పట్టణానికి నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భిక్కనూరు మండలంలోని ఓ ఫార్మా కంపెనీ రూ.76 లక్షలు కామారెడ్డి పట్టణంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు నిధులు కేటాయించిందని, భిక్కనూరుతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో భిక్కనూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యువకులు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాక్టరీల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకోగా, పాఠశాల నిర్మాణానికి సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాలని గ్రామసభలో ప్రజలు కోరినా పట్టించుకోని ఫార్మా కంపెనీ కామారెడ్డి స్టేడియం అభివృద్ధి నిధులు వెచ్చించడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికార పార్టీ నేతల తీరుపై ఆగ్రహం
భిక్కనూరు మండలం నుంచి అధికార పార్టీలో కీలక నేతలు ఎందరు ఉన్నా సీఎస్‌ఆర్ నిధులను స్థానిక అవసరాలకు వినియోగించకుండా కామారెడ్డి పట్టణానికి తరలించుకుపోతే నోరెత్తడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు కాలుష్యం కారణంగా చూపిన నాయకులు, కాలుష్యం నుంచి కాపాడేందుకు భిక్కనూరుకు సీఎస్‌ఆర్ నిధులు ఇప్పించాల్సింది పోయి కామారెడ్డికి తీసుకువెళ్లడమంటే భిక్కనూరు ప్రజలకు అన్యాయం చేయడమేనని విమర్శిస్తున్నారు.
కాలుష్యం భిక్కనూరుకు..
కాసులు కామారెడ్డికి..!
ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతాలకు కాలుష్యం
పట్టణాలకు నిధుల కేటాయిపు
భిక్కనూరు మండల వాసుల
నిరసనగళం


