రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పటేల్ చెరువులోకి నాలుగు రోజులుగా కొత్త అతిథుల రాక తో సందడిగా మారింది. చెరువు మధ్యలోని గుట్టలపై నల్లటి రంగులో ఉన్న పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చి వాలుతున్నాయి. వీటిని నీటికాకులుగా గుర్తించారు. ఇవి చేపల వేట కోసం నీటి వనరులు, చెరువుల వద్ద గుంపులుగా చేరుతుంటాయని మత్స్యకారులు తెలిపారు. గతంలో ఎప్పుడు ఈ రకం పక్షులను ఈ చెరువు పరిసరాల్లో చూడలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఎండిపోవడంతో, పటేల్ చెరువులో కాస్తోకూస్తో నీటి నిల్వలు ఉండటంతో ఈ పక్షులు తరలివచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


