ఆనంద్‌భవన్‌ను కోర్టు ఏర్పాటుకు ఇవ్వాలని వినతి | - | Sakshi
Sakshi News home page

ఆనంద్‌భవన్‌ను కోర్టు ఏర్పాటుకు ఇవ్వాలని వినతి

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

ఆనంద్‌భవన్‌ను కోర్టు ఏర్పాటుకు ఇవ్వాలని వినతి ఎలుగుబంటి సంచారం శబరిమాత ఆశ్రమంలో భజనలు ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ నేడు మత్తడి పోచమ్మ ఆలయ ప్రారంభోత్సవం

దోమకొండ: మండల కేంద్రానికి సబ్‌ కోర్టు మంజూరైందని కోర్టు కొనసాగేందుకు మండల కేంద్రంలోని గడికోటకు చెందిన ఆనంద్‌ భవనం కేటాయించాలని సర్పంచ్‌ నర్సయ్య కోరారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌లో గడికోట వారసులు కామినేని అనిల్‌కుమార్‌కు సర్పంచ్‌ ఐరేని నర్సయ్య వినతిపత్రం అందజేశారు. ఆనంద్‌ భవనాన్ని ఒక సంవత్సరం వరకు ప్రజల సౌకర్యార్థం అనుమతి ఇవ్వాలని కోరారు. త్వరలోనే శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. గడికోట ట్రస్టు మేనేజర్‌ బాబ్జి, తదితరులు ఉన్నారు.

వర్ని: మోస్రా మండలంలో ఎలుగుబంటి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. శనివారం రాత్రి మోస్రా నుంచి చింతకుంట వెళ్తున్న వ్యక్తులకు ఎలుగుబంటి కనిపించిందని అధికారులు తెలిపారు. రాత్రి, తెల్లవారుజామున ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లో సంచరించరాదని అత్యవసర పని ఉంటే గుంపులు గుంపులుగా వెళ్లాలన్నారు. ఎలుగుబంటిని చూడటానికి దగ్గరగా వెళ్లవద్దని సూచించారు. అటవీ ప్రాంతాల్లో జంతువుల సంచారం ఇటీవల పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో శనివారం రాత్రి భక్తులు భగవన్నామ సంకీర్తనలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక భజనలు చేశారు. అలాగే ఆలయం ప్రాంగణంలోని వేంకటేశ్వర, దత్తాత్రేయా, మార్కండేయ ఆలయాలలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఈ భజన కార్యక్రమం శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొన సాగింది. ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

బిచ్కుంద(జుక్కల్‌): మండలంలోని గోపన్‌పల్లి శివారు, ఐటీఐ కళాశాల ప్రాంగణంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం కేసుచేసి కాపర్‌ వైర్‌ ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రవికుమార్‌, ఎస్సై రాజు ఆదివారం తెలిపారు. కొన్ని నెలల క్రితం బిచ్కుంద పీఎస్‌ పరిధిలోని ఆయా గ్రామాల శివారులలో 19 ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం కేసులో విద్యుత్‌ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఫత్లాపూర్‌ దాబా హోటల్‌ వద్ద అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని పట్టుకొని విచారించామన్నారు. నిందితులు జరిగిన ఘటనల్లో నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు మహారాష్ట్ర పర్భాని జిల్లాకు చెందిన సత్నామ్‌సింగ్‌, చందుసింగ్‌ విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రుద్రూర్‌: పోతంగల్‌ మండల కేంద్రంలో నూతనంగా పునర్నిర్మించిన మత్తడి పోచమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. మల్లెపూల గంగాధర్‌ గౌడ్‌, మల్లెపూల సామంత్‌ గౌడ్‌ కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. సోమవారం ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement