నిజామాబాద్ రూరల్: నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో డిసెంబర్ 4న హరిదా రచయితల సంఘం మహాసభ నిర్వహించనున్నట్లు జిల్లా హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ తెలిపారు. ఇందులో భాగంగా ‘సరస్వతీరాజ్ –హరిదా అంతర్జాతీయ ఉత్తమ తెలంగాణ కథా పురస్కారం–2026’ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా కార్యక్రమ వాల్‌పోస్టర్లను హైదరాబాద్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ చీఫ్ కవిత చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ భాష జీవభాష అని అన్నారు. దేవేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ భాష, సంస్కృతుల వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతోనే కథల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ భాషలో కథలు రాసే రచయితలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్న కథా రచయితలు తమ కథను, హామీ పత్రాన్ని అక్టోబర్ 30వ తేదీ లోపు పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు 9030033331 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి, నాయకులు రూప్‌సింగ్, శరత్ పాల్గొన్నారు.


