సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు దక్కలేదు. ముఖ్యంగా ఏళ్ల తరబడిగా నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి ప్రాజెక్టు 22వ ప్యాకేజీకి ఈ సారి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరగలేదు. దీంతో జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు. కాగా అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్తవి అమలుకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా కుటుంబ భద్రత కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను జూన్ 2 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. సంపాదకుడు చనిపోయినపుడు కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షల బీమా అందించేలా పథకాన్ని రూపొందించారు. రేషన్ కార్డు ప్రామాణికంగా అమలు చేస్తే జిల్లాలో 2,94,479 కుటుంబాలకు బీమా వర్తించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్న 80 వేల పైచిలుకు మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఐదు వేల పైచిలుకు మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా జిల్లాలో 10 వేల పైచిలుకు ఉద్యోగులు, అలాగే రెండు వేల పైచిలుకు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో చదువుతున్న విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందిస్తామని ప్రభు త్వం ప్రకటించింది.
రైతులకు నూరు శాతం సబ్సిడీపై సోలార్ పంపుసెట్లు అందించనుంది. దివ్యాంగులైన విద్యార్థులకు ఫిట్టెడ్ మోటరైజ్డ్ బైకులు అందించనుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై వివిధ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రజల బడ్జెట్ అంటూ కితాబునిస్తున్నారు.


