గుడ్‌విల్ దందా..
ఎక్కువగా కొత్తవారికే వచ్చాయి
● మద్యం వ్యాపారుల బేరసారాలు
● రూ.లక్షలు పలుకుతున్న
మద్యం దుకాణాలు
బాన్సువాడ : లక్కీడ్రాలో దుకాణాలు దక్కని లిక్కర్ వ్యాపారులు మరో ప్రయత్నానికి తెరలేపారు. నూతనంగా వైన్ షాపులను దక్కించుకున్న వారిని నేరుగా కలిసి గుడ్‌విల్ ఇస్తామని, దుకాణాలను అప్పగించాలని బేరాలు చేస్తున్నారు. దుకాణాల విక్రయాల మేరకు రూ.80 లక్షల వరకు ఇచ్చేందుకు వ్యాపారులు సిద్ధపడుతున్నారు.
బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని బాన్సువాడ పట్టణంలో 5, బీర్కూర్–1, నస్రుల్లాబాద్–2 నిజాంసాగర్–1 మద్యం దుకాణాలకు 239 దరఖాస్తులు రాగా లక్కీ డ్రా ప్రక్రియ ముగిసింది. అయితే, లక్కీ డ్రాలో కొత్తవారికి 5 మద్యం దుకాణాలు వచ్చాయి. దీంతో మద్యం వ్యాపారులకు నిరాశకు గురయ్యారు. డిమాండ్ ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు రాయబేరాలు మొదలుపెట్టారు. రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇచ్చి వైన్సులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 140 దరఖాస్తులు వేసిన ఓ సిండికేట్‌కు నామమాత్రంగా 9 దుకాణాలే రావడంతో మరింత పెట్టుబడి పెట్టి మరో నాలుగైదు వైన్స్‌లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ పట్టణంలోని ఓ మద్యం దుకాణం కొత్త వారికి వచ్చింది. దీంతో ఆ వైన్స్‌కు లిక్కర్ వ్యాపారులు రూ.60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు గుడ్‌విల్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే, సదరు లక్కీడ్రా అదృష్టవంతుడు ఎవరు ఎక్కువ గుడ్‌విల్ ఇస్తే వారికే మద్యం దుకాణం అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో లక్కీడ్రాలో ఎక్కువగా కొత్తవారికే వైన్స్‌లు వచ్చాయి. పాత వారికి తక్కువగా దుకాణాలు వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి.
– దిలీప్, ఎకై ్సజ్ సీఐ బాన్సువాడ


