ఒక్కో బస్తాకు రూ.2
నిజాంసాగర్(జుక్కల్): ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీల డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క బస్తాకు రూ. 2 చొప్పున చెల్లిస్తేనే మిల్లుకు తీసుకెళ్తామని ఖరాఖండీగా చెప్తున్నారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండలం ముగ్ధంపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను తరలించేందుకు ఓ లారీ చేరుకుంది. అయితే, ముందస్తుగా రూ. 800 చెలిస్తేనే బస్తాలను తీసుకువెళ్తానని లారీ డ్రైవర్ డిమాండ్ చేసినట్లు సొసైటీ డైరెక్టర్, కేంద్రం ఇన్‌చార్జి బషీర్ విలేకరులతో తెలిపారు. డబ్బులు ఇవ్వబోమని చెప్పడంతో సదరు డ్రైవర్ లారీని వెనక్కి తీసుకుపోయాడు. దీంతో కేంద్రంలో తూకం చేసిన ధాన్యం బస్తాలు అలాగే నిల్వ ఉన్నాయి.
గాలీపూర్ గ్రామంలోని ఐకేపీ కేంద్రానికి వచ్చే లారీ డ్రైవర్లు సైతం బస్తాకు రూపాయి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


