వరద నీటిలో మునిగిన వడ్ల ట్రాక్టర్
● డ్రైవర్‌ను కాపాడిన గ్రామస్తులు
నిజాంసాగర్/బిచ్కుంద: బిచ్కుంద మండలం చిన్నదేవాడ శివారులోని వాగులో ధాన్యం తరలిస్తున్న ట్రాక్టర్ మునిగి పోగా.. డ్రైవర్‌ను గ్రామస్తులు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు మంగళవారం సాయంత్రం గ్రామ శివారు నుంచి ట్రాక్టర్‌లో వడ్లను ఇంటికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో వరద నీటిలో ట్రాక్టర్ మునిగింది. తాడు సహాయంతో గ్రామస్తులు ట్రాక్టర్ డ్రైవర్‌ను వాగులో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కౌలాస్‌నాలా ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారని రైతులు ఈ సందర్భంగా ఆరోపించారు. బిచ్కుందలోని గోపన్‌పల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. నీటి ప్రవాహంలో ట్రాక్టర్‌లో వడ్లు, ట్రాక్టర్‌కు నష్టం వాటిల్లిందని, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు పోయేపరిస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వేణుగోపాల్ రైతుల వద్దకు చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, పరిహారం వచ్చేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
వరద నీటిలో మునిగిన వడ్ల ట్రాక్టర్


