
అమెజాన్ డెలివరీ హబ్ పేరిట సైబర్ మోసం
బాల్కొండ: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తిని అమెజాన్ డెలివరీ హబ్ పేరిట సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టించి, రూ.లక్ష71వేలను కాజేశారు. బాల్కొండ ఎస్సై శైలెంధర్ తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మాలెం సత్యసాగర్‌కు గత నెల 27న అమెజాన్ డెలివరీ హబ్ నుంచి మాట్లాడుతున్నట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. బాల్కొండలో అమెజాన్ హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అందుకు మీ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. అందుకు ముందుగా రూ.17,700 చెల్లించాలని సూచించాడు. దీంతో అదే రోజు బాధితుడు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించాడు. మళ్లీ ఈ నెల 15న ఫోన్ చేసి ఒప్పందం కోసం రూ. 28వేల 972 పంపించాలని వారు తెలుపగా, వెంటనే పంపించాడు. మెటీరియల్ కోసం డబ్బులు పంపమంటే ఇటీవల రూ.లక్ష 24వేలు ఫోన్‌పే ద్వారా పంపించాడు. కొన్ని రోజుల నుంచి వరుస ఫోన్ కాల్స్ రావడంతోపాటు వారు మాట్లాడుతున్న విధానాన్ని గమనించి సైబర్ మోసానికి గురైనట్లు గ్రహించాడు. వెంటనే సైబర్‌క్రైం హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
డ్రంకెన్‌డ్రైవ్ కేసులో ఒకరికి జైలుశిక్ష
నవీపేట: నవీపేట శివారులో ఇటీవల పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సదరు వ్యక్తి మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన నాగనాథ్ గంగారామ్‌గా గుర్తించి, కేసు నమోదు చేశారు. అనంతరం మంగళవారం పోలీసులు అతడిని కోర్టులో హాజరు పర్చగా, జడ్జి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
నగరంలో..
ఖలీల్‌వాడి: నగరంలో పోలీసులు ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు. వారికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లా కోర్టులోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరు పర్చారు. జడ్జి వారిలో 22 మందికి రూ. 26 వేల జరిమానా విధించాగా నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. అలాగే ఓ మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడగా, పోలీసులు వాహన యజమానిని పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. జడ్జి అతడికి రెండు రోజుల జైలుశిక్ష విధించారు.
నిబంధనలు పాటించని దుకాణ యజమానికి..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌కు చెందిన షేక్ ఖలీమ్ అనే రాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా దుకాణం నిర్వహిస్తుండటంతో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు మంగళవారం ఆర్మూర్ మార్నింగ్‌కోర్టు మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ ఎదుట హాజరుపర్చగా ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విఽధించినట్లు పోలీసులు తెలిపారు.
తప్పిపోయిన బాలుడు..
తల్లి చెంతకు చేర్చిన పోలీసులు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో ఓ బాలుడు ఇంటికి వెళ్లే దారి తెలియక తప్పిపోవడంతో పోలీసులు గుర్తించి, తల్లి చెంతకు చేర్చారు. వివరాలు ఇలా.. మామిడిపల్లికి చెందిన ప్రణయ్ అనే ఐదేళ్ల బాలుడు మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి అతడు తిరిగి ఇంటికి వెళ్తుండగా దారి తెలియక జాతీయ రహదారి కూడలిలో ఏడుస్తుండగా, పోలీసులు గుర్తించారు. వెంటనే వారు బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. కొద్దిసేపటికే బాలుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు తల్లిదండ్రుల చిరునామాను తెలియజేశారు. దీంతో మామిడిపల్లిలో నివాసం ఉంటున్న తల్లి శిరీషకు బాలుడిని క్షేమంగా అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.