తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఓ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. వివరాలు ఇలా. 2023లో హర్షద్ అలీ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి బెంగళూరుకు బాస్మతి బియ్యంకు సంబంధించిన లోడ్ లారీతో బయలుదేరాడు. మార్గమధ్యలో యజమానికి తెలియకుండా మొత్తం బియ్యంను రూ.3.50 లక్షలకు విక్రయించి ఖాళీ లారీని దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొందుర్తి వద్ద రోడ్డు పక్కన వదిలిపెట్టి పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా రెండు సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎస్పీ రాజేశ్ చంద్ర సూచన మేరకు పోలీసులు ఇటీవల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడు హర్షద్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలుసుకొని మూడు రోజుల క్రితం అక్కడికి వెళ్లారు. ఓ ప్రాంతంలో అతడిని గుర్తించి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువచ్చారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్‌ఐ బృందాన్ని శనివారం ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. బృంద సభ్యులైన దేవునిపల్లి ఏఎస్సై నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు రవికుమార్, రవికిరణ్ తదితరులు ఉన్నారు.


