పంటను కాపాడుకునేందుకు భగీరథయత్నం
● బండరామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన గోత్రాల శంకర్ అనే రైతు ఐదెకరాలలో వరి వేశాడు. రెండు బోరు బావులు వట్టిపోయాయి. దీంతో పక్కరైతు బోరు నుంచి పైపు వేసుకుని పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
● అక్కాపూర్ గ్రామానికి చెందిన అరిగె లక్ష్మణ్ అనే రైతు ఉన్న ఒక్క బోరు కింద ఆరు ఎకరాల వరి సాగు చేశాడు. మండుతున్న ఎండలతో భూగర్భజలాలు తగ్గిపోయి బోరు వట్టిపోయింది. దీంతో ఎకరం వరకు పంట ఎండిపోయింది. మిగిలిన పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో బోరు తవ్వించాడు. ప్రస్తుతం ఆ బోరు నీటితో వరుస తడులు అందిస్తున్నాడు.
మాచారెడ్డి : మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయి. కళ్లముందే పంటలు ఎండిపోతుండడంతో తట్టుకోలేని రైతులు.. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా బోరుబావులు తవ్విస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. దీంతో చేసేదేమీ లేక పలువురు రైతులు పంటపై ఆశలు వదిలేసుకుని పశువులను మేపుతున్నారు. ఓవైపు సాగునీరందక పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు తెగుళ్లతో మరింత నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


