
ముప్కాల్‌లో మొరం తరలిస్తున్న టిప్పర్
బాల్కొండ: అక్రమాల్లో ఆరితేరిన కొందరు.. దొరికినంత దోచుకునే పనిలో పడ్డారు. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా కాలువ, కుంటలు, మట్టి గుట్టలను గుల్ల చేస్తున్నారు. యంత్రాలతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి డిమాండ్ ఉండడంతో కాసులు కురిపిస్తున్న నేపథ్యంలో అక్రమార్కులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రాజెక్టు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారి వ్యాపారం మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్లుగా దర్జాగా సాగుతోంది..
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద వరద కాలువ జీరోపాయింట్ నుంచి అక్రమార్కులు మొరం దందాను నిశిరాత్రిలో జోరుగా సాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఎస్సారెస్పీ నుంచి నీటి సరఫరా చేసే వరద కాలువ తవ్వకాల్లో చేపడుతున్నారు. మొరం తరలించాలంటే అధికారుల అనుమతితో ప్రభుత్వానికి డీడీ రూపంలో క్యూబిక్ మీటర్‌కు రూ. 136 చెల్లించాలి. అంతేకాకుండా అధికారుల పర్యవేక్షణలో తరలించాలి. కానీ అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు లేకుండానే అధికారులను మచ్చిక చేసుకొని తమ మొరం దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు.
సెలవు దినాలు, రాత్రి వేళల్లో..
మొరం వ్యాపారులు రాత్రి వేళాల్లో, సెలవు దినాల్లో ఎక్కువగా కొనసాగిస్తున్నారు. కొందరు అధికారులు తమకు అందాల్సింది అందితే వారికి ఎలా మొరం తరలించుకోవాలో అక్రమార్కులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఏ అధికారికి ఎంత ఇస్తున్నామనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇంతలా వారికి అండగా ఉండి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు, అక్రమార్కులపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సమన్వయ లోపం..
ఎస్సారెస్పీ, వరద కాలువ నుంచి మొరం తరలించాలంటే ప్రాజెక్ట్ అధికారులు అనుమతివ్వాలి. కానీ రెవెన్యూ అధికారులు సైతం తమ అనుమతి కూడా ఉంటుందని చెబుతున్నారు. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో మొరం వ్యాపారులకు అవకాశంగా మారింది. ఇరు శాఖల అధికారులు సైతం ఎవరికీ వారు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనేది బహిరంగ రహస్యం.
ఎస్సారెస్పీ వరద కాలువ జీరో
పాయింట్ నుంచి మొరం తవ్వకాలు
రాత్రి వేళలో జోరుగా
సాగుతున్న దందా
ప్రాజెక్టు, రెవెన్యూ అధికారుల మధ్య
సమన్వయ లోపం
అవకాశంగా మలుచుకుంటున్న
అక్రమార్కులు
చర్యలు తీసుకుంటాం..
మొరం రాత్రి వేళల్లో తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. చర్యలు తీసుకుంటాం. మొరం తరలించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఎవరైనా మొరం తరలిస్తే ఉపేక్షించేది లేదు. ఎంతటివారినైనా వదలం. సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
–చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ