నమ్మించారు.. నట్టేట ముంచారు.. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బందిని నిలువునా దగా చేస్తున్నారు.. వారి డిమాండ్లు పరిష్కరిస్తామంటూ చంద్రబాబు సర్కారు మూడుసార్లు గడువు తీసుకుని, అంతా అయ్యాక నోరెత్తితే, ఉద్యోగాలు ఉండవని నోటీసులు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. గొడ్డుచాకిరీ చేస్తున్నా అరకొర జీతమే.. ఉద్యోగ భద్రత లేదు, ప్రాణాలు పోతే పట్టించుకునే దిక్కు లేదని పారామెడికల్ సిబ్బంది వాపోతున్నారు.
కాకినాడ క్రైం: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. గురువారం నుంచి అత్యవసర సేవలకు బంద్ ప్రకటించారు. 24 ఏళ్ల నుంచి తమ శ్రమ దోపిడీ చేస్తున్నామని వారు ఆందోళన చేస్తున్నారు. అరకొర జీతాలిచ్చి గొడ్డుచాకిరీ చేయిస్తున్నారని వాపోతున్నారు. ఒకే పని ప్రదేశంలో రెగ్యులర్ ఉద్యోగులకు రెండేసి లక్షలు జీతాలిస్తూ, తమకు మాత్రం రూ.32 వేల నుంచి రూ.39 వేల మధ్య మాత్రమే ఇస్తున్నామని అంటున్నారు. మధ్యలో ఒకసారి రూ.28 వేలకు కూడా తగ్గించి ఇచ్చారు. ఎప్పుడో పదేళ్ల క్రితం బేసిక్ పే, టీఏ, హెచ్‌ఆర్ కలిపి మొత్తం గ్రాస్ శాలరీగా ప్రస్తుతం ఇస్తున్న రూ.32–39 వేల మధ్య మొత్తాన్ని ఇచ్చేవారు. మధ్యలో తగ్గించి, గ్రాస్ శాలరీకి బదులుగా కన్సాలిడేటెడ్ పే అని, ప్రస్తుతం మినిమం టైం స్కేల్ అని ఆ మొత్తాన్నే ఇస్తున్నారు. పదేళ్లుగా ఎదుగుదల లేదు, దీంతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు.
గడువు తీసుకుని మరీ..
పారామెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్ 17న రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్లిన ఉద్యోగులు విజయవాడలో మహాధర్నా నిర్వహించారు. జూలై 6న సమ్మెకు వెళతామని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆ వెంటనే డీఎంఈ, డీఎస్‌హెచ్, డీపీహెచ్‌లకు సెప్టెంబర్ 9 నుంచి సమ్మెలోకి వెళతామని వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 31న ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ఉన్నతాధికారులు పిలిచి ప్రభుత్వం తరఫున 30 రోజుల గడువు అడిగారు. గడువు ముగిశాక మంత్రి సత్యకుమార్‌తో మరోసారి సమావేశం అని చెప్పారు. ఈ సారి ఆయనే స్వయంగా మరో 30 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14,600 మంది పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండో సారి కూడా గడువు ముగిశాక కమిటీ పేరుతో మరోసారి కాలయాపన చేశారు. సమావేశం అని చెప్పి 28 రోజుల తర్వాత, అదీ ఒత్తిడి తెస్తే ఆరుగురు అధికారులు, 10 మంది జేఏసీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏ ఒక్కటీ చేయమని చెప్పి చేతులెత్తేశారు.
సమ్మెకు మద్దతు
ఈ సమ్మెకు ఏపీ ఎన్‌జీజీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుద్దటి రామ్మోహన్, పాలపర్తి మూర్తిబాబులు మద్దతు ప్రకటించారు. సీఐటీయూ తరఫున ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, సీహెచ్ రాజ్‌కుమార్, నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్‌లు మద్దతు తెలిపారు. ఐలూ నగర అధ్యక్ష, కార్యదర్శులు కె.వీరభద్రరావు, కె.నాగజ్యోతి, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్శదర్శి ప్రభాకర్‌వర్మ, అంబేడ్కర్ ఉద్యమ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, టీఎన్‌టీయూసీ నాయకులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.
సమ్మె నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌లో అనుభవం లేని పారామెడికల్ విద్యార్థులతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 17 ఏళ్లు దాటిన పిల్లలే.
సమ్మెలో 600 మంది ఉద్యోగులు
కాకినాడ జీజీహెచ్ సేవల్లో సింహ భాగం కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమే. రెగ్యులర్ ఉద్యోగులు పారామెడికల్‌లో 150 మంది ఉండగా, 600 మంది కాంట్రాక్టు సిబ్బందే. వీరు దశల వారీగా నిరసన చేపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం గడువు పేరుతో మూడు నెలల ఉద్దేశపూర్వక జాప్యం చేస్తూ, నమ్మించి నెట్టుకొచ్చింది. దీంతో ఫార్మాసిస్టులు మినహా జీజీహెచ్ నుంచి స్టాఫ్ నర్సులు, ఈసీజీ టెక్నీషియన్లు, ల్యాబ్, క్యాథ్ ల్యాబ్, కార్డియాక్ టెక్నీషియన్లు సమ్మెలో పాల్గొంటున్నారు.
ఫ పాపం పారామెడికల్ సిబ్బంది
ఫ సమస్యలు పరిష్కరిస్తామంటూ
మూడు సార్లు గడువు కోరిన ప్రభుత్వం
ఫ తీరా గడువు ముగిశాక నోరెత్తితే
ఉద్యోగాలు ఉండవని నోటీసులు
ఫ రెగ్యులర్ చేసేవరకూ సమ్మె
కొనసాగిస్తామంటున్న ఉద్యోగులు


