ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

Mar 3 2026 8:19 AM | Updated on Mar 3 2026 8:19 AM

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

ఎమ్మెల్సీ గోపీ మూర్తి

తొండంగి: పేదలు, ఉపాధ్యాయుల సమస్యలపై కనీస చర్చ కూడా లేకుండా శాసన మండలి సమావేశాలు నిర్వహించడం అత్యంత దుర్మార్గమని ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ బి.గోపీ మూర్తి అన్నారు. మండలంలోని బెండపూడి, తొండంగి, పెరుమాళ్లపురం, అద్దరిపేట తదితర గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలతో పాటు వాకదారిపేట కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని (కేజీబీవీ) సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తొండంగిలో విలేకర్లతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల మీద తీవ్రమైన పని ఒత్తిడి పెట్టారన్నారు. బోధనేతర పనులు రద్దు చేసి, విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే పరిస్ధితులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో ఐచ్ఛిక సెలవులు, స్ధానిక సెలవులపై నిర్ణయాధికారాన్ని ఎంఈఓలు, హెచ్‌ఎంలకు కల్పించాలన్నారు. మధ్యతరగతి ఉద్యోగులు, పేదల సమస్యలపై చర్చించకుండానే శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు జరపడం దుర్మార్గమన్నారు. అలాగే, 11వ పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలవుతున్నా 12 పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను ముఖ్యమంత్రి నియమించలేదని దుయ్యబట్టారు. వెంటనే పీఆర్సీ వేసి 29 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని, రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపునకు రూట్‌ మ్యాప్‌ ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని, ఎంటీఎస్‌, కేజీబీవీ కాంట్రాక్ట్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని గోపీ మూర్తి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు టి.సత్తిబాబు, టీవీ రామకృష్ణ, పి.సత్యనారాయణ, ప్రసన్నకుమార్‌, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement