● వేట్లపాలెం పేలుడు జరిగి 3 రోజులు
● ఆ రోజు అక్కడ ఎంతమంది
ఉన్నారనేదానిపై ఇప్పటికీ అయోమయం
● 70 మంది వరకూ ఉన్నారనేది
ప్రాథమిక సమాచారం
● ఇప్పటి వరకూ మృతులు 22 మంది
● ఆస్పత్రిలో ఏడుగురు
● మృత్యుంజయుడిగా ఒకరు
● మిగిలిన వారేమయ్యారనేది ప్రశ్నార్థకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో 22 నిండుప్రాణాలను బలిగొన్న పెను విస్ఫోటం సంభవించి సోమవారానికి మూడు రోజులైంది. ఈ విస్ఫోటం మిగిల్చిన విషాదం నుంచి వేట్లపాలెం, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల ప్రజలు ఇంకా కోలుకోలేదు. రోజులు గడుస్తున్నా శనివారం నాటి దృశ్యాలే కళ్లెదుటే కనిపిస్తున్నాయని స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు ఈ విషాద ఘటనకు సంబంధించి ఇప్పటికీ అనేక ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. ఆ రోజు పేలుడు జరిగిన సమయంలో అక్కడ అసలు ఎంత మంది పని చేస్తున్నారు? మృతులు, క్షతగాత్రులను మినహాయిస్తే మిగిలిన వారేమయ్యారు? అనే ప్రశ్నలకు అధికారులు ఇప్పటి వరకూ స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నారు. దీంతో, ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు.
ప్రాథమిక అంచనా ఇదీ..
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు శనివారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. ఆ సమయంలో ఎంత మంది మందుగుండు తయారీలో పని చేస్తున్నారనేదానిపై ఇంకా స్పష్టతకు రాలేకపోతున్నారు. అధికార యంత్రాంగం ప్రాథమిక సమాచారం ప్రకారం.. పేలుడు సమయంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో 70 మంది వరకూ పని చేస్తున్నారు. పేలుడు ధాటికి సంఘటన స్థలంలోనే 20 మంది మృతి చెందారు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో 9 మందిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ తొమ్మిది మందిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆదివారం మృతి చెందారు. మిగిలిన ఏడుగురు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉంది. ఇంతటి భారీ విస్ఫోటం నుంచి స్వల్ప గాయాలతో.. ఒక విధంగా మృత్యుంజయుడిగా పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్ బయట పడ్డాడు. వీరందరినీ కలిపితే మొత్తం 30 మంది లెక్క తేలింది. బల్క్ ఆర్డర్ రావడంతో పేలుడు జరిగిన రోజున సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో వేట్లపాలెం, పెద్దాపురం, సామర్లకోట కుమ్మర వీధి, పెదబ్రహ్మదేవం తదితర గ్రామాల నుంచి 70 మందికి పైగానే పనిలో పెట్టుకున్నారని స్థానికులతో పాటు అధికారులు కూడా మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే, పేలుడు జరిగినప్పుడు ఆ 70 మందీ ఉన్నారా లేక కొంత మంది మాత్రమే ఉన్నారా అనేది మాత్రం ఇప్పటికీ తేలడం లేదు.
వారు ఇళ్లకు వెళ్లారా!
వేట్లపాలెం, గూడపర్తి గ్రామాల నుంచి వచ్చిన కూలీల్లో కొందరు మధ్యాహ్న భోజనం కోసం, మరికొందరు పింఛన్లు తీసుకునేందుకు ఆ సమయంలో ఇళ్లకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. వారు తిరిగి బాణసంచా తయారీకి వెళ్లేందుకు సిద్ధపడుతున్న క్రమంలో భారీ విస్ఫోటం సంభవించడంతో ఇళ్ల వద్దనే ఆగిపోయారని అంటున్నారు. ఆవిధంగా 30 మంది వరకూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మృతులు, క్షతగాత్రులు, మృత్యుంజయుడితో కలిపి 60 మంది వరకూ లెక్క తేలుతోంది. మిగిలిన 10 మంది ఎక్కడున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. వారు కూడా మధ్యాహ్న భోజనం తరువాత పనికి వెళ్లలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వీరిలో నలుగురైదుగురు ఇతర గ్రామాల నుంచి చుట్టపుచూపుగా వచ్చిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. కళ్లెదుట భారీ విస్ఫోటం సంభవించడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి ఉంటారని చెబుతున్నారు. పోలీసు విచారణతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయంతోనే వారు కనిపించకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
పెద్దాపురం ఆర్డీఓ సస్పెన్షన్
ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఆర్డీఓ, డీఎస్పీ, అగ్నిమాపక, కార్మిక శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు శనివారం జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడ జీజీహెచ్ వద్ద ప్రకటించారు. దీనిపై కూడా అయోమయం నెలకొంది. సీఎం ఆదేశాలు ఇప్పటి వరకూ అమలు కాకపోవడంపై భిన్న వాదనలు వినిపించాయి. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉంది. ఆ మండలం ఇటీవలే కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో విలీనమైంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌కు అనుమతులిచ్చింది అప్పటి కాకినాడ ఆర్డీఓ. పర్యవేక్షించాల్సింది కూడా ఆయనే. దీనిపై స్పష్టత లేకుండా ఆర్డీఓను సస్పెండ్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించడంతో ఎవరిపై చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులు తేల్చుకోలేకపోయారు. చివరకు పెద్దాపురం ఆర్డీఓ కె.శ్రీరమణిని సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.
పర్యవేక్షణ లేకే..
బాణసంచా తయారీ కేంద్రాన్ని సంబంధిత ఎస్సై రోజువారీ, సీఐ 15 రోజులకోసారి, డీఎస్పీ నెలకోసారి పర్యవేక్షించాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదేవిధంగా వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌పై పర్యవేక్షణ ఉండి ఉంటే ఇలాంటి దుర్ఘటనకు తావుండేది కాదు. ఇక బాణసంచా తయారీ కేంద్రంలో సీసీ కెమెరాలపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి బాణసంచా తయారీ కేంద్రాలు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఆవిధంగా విస్ఫోటం జరిగిన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో సీసీ కెమెరాలున్నాయా అనే విషయంపై ఇప్పటి వరకూ అధికారులు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనే పలువురు చెబుతున్నారు. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్ ఫోన్‌లో రికార్డు అవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు కాలిపోయినా.. ఆ వీడియోలు మాత్రం లభించే అవకాశం ఉంది. వీటిని పరిశీలిస్తే తొలుత విస్ఫోటం ఎక్కడ ఎందుకు సంభవించింది.. ఎక్కడి నుంచి, ఏవిధంగా మంటలు చెలరేగాయనే విషయాన్ని పోలీసులు వేగంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారనే అంశాలపై కూడా స్పష్టత వస్తుందని అంటున్నారు.
వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో జరిగిన పేలుడులో చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగలు (ఫైల్)


