బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని పట్టణాలు, వాటి ప్రవేశ రహదార్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ముమ్మరంగా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్ ఇంజినీర్లుతో కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం పట్టణాల్లో అంతర్గత పారిశుధ్యం, ఆయా పట్టణాల ప్రవేశ మార్గాల్లో చెత్త తొలగింపు కార్యక్రమాలపై స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ నగరంలోకి నాలుగు వైపుల నుంచి ప్రవేశించే ప్రధాన మార్గాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ఎక్కడెక్కడ, ఏయే పనులు చేపట్టాలో గుర్తించాలని, అంచనాలు సిద్ధం చేసి, అవసరమైన జేసీబీలు, టిప్పర్లు, ఇతర యంత్రాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. తొలగించిన చెత్తను తరలించేందుకు స్థానికంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా పాల్గొన్నారు.
పశు సంవర్ధక శాఖ
జేడీగా శ్రీధర్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పశు సంవర్ధక శాఖ ఇన్‌చార్జ్ జేడీగా వడ్డి శ్రీధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో పని చేసిన కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కాకినాడ వెటర్నరీ పోలి క్లినిక్ డీడీగా పని చేస్తున్న శ్రీధర్‌కు ప్రభుత్వం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. శ్రీధర్ గతంలో పాయకరావుపేట, తునిల్లో పశు సంవర్ధక శాఖ డీడీగా పని చేశారు. ఇన్‌చార్జి జేడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌ను జిల్లాలోని పశు సంవర్ధక శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.
కూటమిని కూకటి వేళ్లతో
పెకలిస్తున్న ఏడుకొండల స్వామి
కాకినాడ రూరల్: తిరుమల పుణ్యక్షేత్రంతో ఆటలాడిన కూటమి ప్రభుత్వాన్ని ఆ ఏడుకొండల స్వామి కూకటివేళ్లతో పెకలిస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో అన్నీ స్కాములేనని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు విషప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవం ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబు ఆ స్వామి నుంచి తప్పించుకోలేరన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ పాత్ర తేటతెల్లమైందన్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వ్యవహారం బయట పడిందన్నారు. వేంకటేశ్వరస్వామితో రాజకీయం చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని నాగమణి డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో శ్రీ వైష్ణవి డెయిరీ పాత్ర ఉందని తేలడంతో రాత్రికి రాత్రే బోర్డులను మార్చింది నిజం కదా అని ప్రశ్నించారు. శ్రీ వైష్ణవి డెయిరీకి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు చెందిన సంగం డైరీతో లింకులున్నట్లు స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యేల రహస్య వీడియోలు, సంబంధాలు తప్ప ప్రజలకు చేసిన ఒక్క మంచి పనయినా ఉందా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం ప్రభుత్వ భూములను కారుచౌకగా అనుయాయులకు కట్టబెట్టారని నాగమణి విమర్శించారు.
పీజీఆర్‌ఎస్‌కు 576 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 576 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


