విషాదం కుమ్మరించిన వేళ.. | - | Sakshi
Sakshi News home page

విషాదం కుమ్మరించిన వేళ..

Mar 3 2026 8:19 AM | Updated on Mar 3 2026 8:19 AM

వేట్లపాలెం పేలుడు మృతుల్లో

నలుగురు కుమ్మర వీధి వాసులే

సంఘటన స్థలంలో ఇద్దరు సజీవదహనం

చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి

నలుగురిలో ముగ్గురు ఒకే

కుటుంబానికి చెందిన వారు

గుండెలు బాదుకుంటూ

రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సామర్లకోట: పట్టణంలోని కుమ్మర వీధిలో విధి పెను విషాదాన్ని కుమ్మరించింది. ఈ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గీయులు ఎక్కువగా నివాసం ఉంటారు. అందరూ రోజు కూలి చేసుకుంటూ జీవనం గడుపుతారు. వారికి తెలిసిన విద్య బాణసంచా తయారీయే. ఈ నేపథ్యంలో శనివారం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో పని చేయడానికి వెళ్లి.. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందారు.

సంఘటన స్థలంలో కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి నాని, ఏడిద శ్యామ్‌ కుమార్‌ సజీవ దహనం కాగా.. అదే ప్రాంతానికి చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

మొత్తం కుమ్మర వీధికి చెందిన నలుగురు మృతుల్లో ముగ్గురు దర్శిపాటి కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి దుఃఖానికి అంతే లేకుండా ఉంది. దర్శిపాటి రాజు మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనంలో సోమవారం తీసుకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు.

ఆస్పత్రి నుంచి క్షేమంగా వస్తాడన్నారు

బాణసంచా ప్రమాదం జరిగిన వెంటనే నా భర్త గురించి ఆరా తీశాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నడని, త్వరలోనే ఇంటికి వస్తాడని బంధువులు, స్థానికులు చెప్పారు. 48 గంటలు గడవక ముందే నా భర్త మృతి వార్త వచ్చింది. ఆయన శవాన్ని సోమవారం అప్పగించారు. చివరి చూపు చూసుకునే అవకాశం కూడా దక్కలేదు. నా ఇద్దరు ఆడ పిల్లలకు ఆధారం లేకుండా పోయింది. మరిది, మామగారితో పాటు నా కుటుంబాన్ని నా భర్తే పోషించే వాడు. నేను ఇంటర్‌ వరకూ చదువుకున్నాను. కుటుంబ పోషణకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి.

– రాజేశ్వరి, దర్శిపాటి రాజు భార్య, సామర్లకోట

ఇద్దరు పిల్లలు, మామగారిని పోషించాలి

నా భర్త బాణసంచా షాపులో సజీవ దహనమయ్యాడు. అతని తండ్రితో పాటు కుటుంబాన్ని నా భర్త పోషించే వాడు. ఆయన చనిపోవడంతో ఇద్దరు పిల్లలు మానస, అఖిలలను ఏవిధంగా పోషించాలో అర్థం కావడం లేదు. వారిని చదివించుకోవాల్సి ఉంది. కుటుంబాన్ని నడిపే నాథుడు లేకుండా పోయాడు. ఎటువంటి ఆధారం లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం.

– గంగాభవాని, దర్శిపాటి నాని భార్య, సామర్లకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement