నేడు సత్యదేవుని ఆలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

నేడు సత్యదేవుని ఆలయం మూసివేత

Mar 3 2026 8:19 AM | Updated on Mar 3 2026 8:19 AM

అన్నవరం: చంద్రగ్రహణం కారణంగా అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు మూసివేయనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులను ఉదయం 10 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకూ ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా సత్యదేవుని వ్రతాలను ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్యకల్యాణం, కేశఖండన టిక్కెట్లు ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. అలాగే, స్వామివారి ప్రసాదాలు ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా నిర్వహించే ఆయుష్య హోమం, స్వామివారి నిత్య కల్యాణం ఉదయం 9 గంటలకు బదులు ఉదయం 7 గంటలకూ ప్రారంభించి, 9.30 గంటల్లోపు పూర్తి చేస్తారు. గ్రహణానంతరం స్వామివారి ఆలయం, వ్రతమండపాలు, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి బుధవారం తెల్లవారుజాము నుంచి యథావిదిగా స్వామివారి దర్శనాలు, వ్రతాలు, పూజలు, కల్యాణం, ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

నేడే చంద్ర గ్రహణం

వీరేశ్వరస్వామి ఆలయం మూసివేత

ఐ.పోలవరం: ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి జరిగే భక్తుల కల్యాణాలు రద్దు చేసినట్లు మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ వి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. దేవస్థానం అనుసరించే పంచాంగం ప్రకారం ఆలయ అర్చకులు, పురోహితుల సూచనల మేరకు ఉదయం జరగాల్సిన అభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం తదితర పూజలు జరిపించి ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. స్పర్శ సూర్యాస్తమయం 6.09 నుంచి సాయంత్రం 6.48 వరకూ గ్రహణ మోక్ష కాలం ఉంటుందన్నారు. మోక్ష కాలం అనంతరం ఆలయ మహా సంప్రోక్షణ, అభిషేకం, మహానివేదన, ధూప సేవ చేసి అనంతరం స్వామివారికి అర్చకులచే ఏకాంతంగా నిత్య కల్యాణం జరుగుతుందన్నారు. ఈ సమయంలో భక్తుల దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు ఉంటాయన్నారు.

ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు

అల్లవరం: గోదావరి జిల్లాలోని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను సమగ్రంగా విశ్లేషించి, వాటి సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా చేసిన పరిశోధన ప్రాజెక్టుకు గాను అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలకు జాతీయ స్థాయిలో చోటు దక్కింది. ఆ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న అయ్యగారి నాగేశ్వరరావు, శ్రీపాద రామకృష్ణ, ఆకుల ప్రవీణ్‌లు చేసిన ‘గోదావరి జిల్లాల వైదిక వారసత్వంపై విశ్లేషణాత్మక అధ్యయనం’ ప్రాజెక్టుకు గుర్తింపు దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందని బీవీసీ చైర్‌ పర్సన్‌ బోనం కనకదుర్గ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో గోదావరి జిల్లాల వైదిక వారసత్వం మేటిగా నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టుతో తమ కళాశాల విద్యా పరిశోధన రంగాల్లో మైలురాయిని అధిగమించిందని ప్రిన్సిపాల్‌ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement